National Fire Service Day in RFC: ముంబైలో 75 ఏళ్ల క్రితం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో అసువులు బాసిన 66 మంది అగ్నిమాపక సిబ్బంది జ్ఞాపకార్థం.. ఏటా ఏప్రిల్ 14 నుంచి అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగాక బాధపడటం కంటే.. ముందే అప్రమత్తమైతే విప్తతును అరికట్టవచ్చనే ఉద్దేశంతో.. అగ్నిమాపకశాఖ ప్రజల్లో అవగాహన పెంచుతోంది. ఈ వారోత్సవాలకు సంబంధించిన గోడపత్రిక, కరపత్రాలను హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆవిష్కరించారు. ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, డైరెక్టర్ శివరామకృష్ణ చేతుల మీదుగా ఈ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా.. అగ్నిమాపకశాఖ సిబ్బంది అందిస్తున్న సేవలను వారు అభినందించారు.
వారోత్సవాల్లో భాగంగా గురువారం నుంచి వారంరోజుల పాటు మాక్‌డ్రిల్స్ నిర్వహిస్తూ.. అగ్ని ప్రమాదాలు-తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. అగ్ని ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు హయత్‌నగర్ అగ్నిమాపక కేంద్రం అధికారి శ్రీనయ్య తెలిపారు. ప్రమాదం జరిగాక సహాయక చర్యలు చేపట్టడం కంటే.. అలాంటి ఘటనలు జరగకుండా ప్రజలను ముందే అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. తాము అందిస్తున్న సేవలకు రామోజీ ఫిల్మ్ సిటీ ఎంతో సహకరిస్తోందని శ్రీనయ్య వివరించారు.
అగ్నిప్రమాదాలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నింటినీ తాము పాటిస్తున్నట్లు ఫిల్మ్‌సిటీలోని పలువిభాగాలకు చెందిన అధికారులు తెలిపారు. తమ వద్ద ఉన్న సౌకర్యాలతో సమీప ప్రాంతాల్లో ప్రమాదాలు సంభవించినప్పుడు.. వాటి నివారణకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: జగన్ 'బాదుడే బాదుడు'తో.. ప్రజలు అల్లాడుతున్నారు: చంద్రబాబు