తొలకరి కబురొచ్చింది.. నైరుతి రుతుపవనాలు శనివారంనాటికి రాయలసీమను పలకరించనున్నాయి. తర్వాత క్రమంగా రాష్ట్రమంతటా విస్తరించనున్నాయి. గురువారం దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలతోపాటు లక్షద్వీప్, దక్షిణ కేరళ, దక్షిణ తమిళనాడు, కొమరిన్-మాల్దీవులు, బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రదేశాల్లోకి ప్రవేశించిన రుతుపవనాలు.. శుక్ర, శనివారాల్లో మరింత విస్తరించనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకతోపాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తాయని వెల్లడించింది.
రాయలసీమలో నేడు భారీ వర్షాలు
రాయలసీమలో శుక్రవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. శనివారం దక్షిణ కోస్తాతోపాటు రాయలసీమలోనూ చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి. ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల వానలు కురిసే అవకాశం ఉంది.
మబ్బులు కమ్మి.. వానలు కురిసి
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో మబ్బులు కమ్మి వర్షాలు కురిశాయి.
* బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోనే గరిష్ఠంగా కృష్ణా జిల్లా నూజివీడులో 129.75 మి.మీ.వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లా గురజాల మండలం పులిపాడులో 111.50, కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో 107.5, చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం కట్టకిందపల్లెలో 106.75, కర్నూలు జిల్లా మెట్టుపల్లి అటవీ ప్రాంతంలో 100.5, శ్రీకాకుళం జిల్లా పాలకొండలో 98.5, అనంతపురం జిల్లా యనమలదొడ్డిలో 95 మి.మీ. చొప్పున వర్షం కురిసింది.
* గురువారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు పలుచోట్ల వానలు కురిశాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో 111.75, విజయనగరం జిల్లా గర్భాంలో 52.75 మి.మీ, పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో 52 మి.మీ చొప్పున నమోదైంది.
కేరళ చేరిన ‘నైరుతి’ పవనాలు
8 జిల్లాలను అప్రమత్తం చేసిన ఐఎండీదిల్లీ/తిరువనంతపురం: నైరుతి రుతుపవనాలు రెండు రోజులు ఆలస్యంగా గురువారం కేరళకు చేరాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. కేరళ రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతాల్లో మేఘాలు ఆవరించినట్టు ఈ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. లక్షదీవులతోపాటు కేరళలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్న అంచనాలతో కేరళలోని ఎనిమిది జిల్లాల్లో ఐఎండీ ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించింది. తాజా రుతుపవనాల ప్రభావంతో దేశంలో చాలాచోట్ల సాధారణం, అంతకుమించిన స్థాయి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
ఇదీచదవండి:
AP CM letter to All CMs: 'కరోనా టీకాల సరఫరాపై ఒకే గొంతుక వినిపిద్దాం'