RAINS: అసని' తుపాన్ మచిలీపట్నం తీరం దగ్గరగా వాయుగుండంగా బలహీనపడిందని ఏపీ విపత్తుల సంస్థ డైరెక్టర్ అంబేద్కర్ తెలిపారు. గత ఆరు గంటల పాటు స్థిరంగా ఉండి అక్కడే బలహీనపడిందన్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45-55 కిమీ వేగంతో గాలులు వీస్తాయన్నారు. తుపాన్ బలహీనపడినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అసని ప్రభావంతో కురిసిన వర్షాలకు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి.
నెల్లూరు: అసని తుపాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో రెండు రోజులుగా ఎడతెరపిలేకుండా వానపడుతోంది. రాత్రి ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆత్మకూరు, అనంతసాగరం, సంగం, ఏఎస్ పేట, చేజర్ల, మర్రిపాడు మండలాల్లో వాన కురిసింది. వరద నీటితో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.
కందుకూరు మండలంలో కురిసిన వర్షాలకు వాగులు పొంగుతున్నాయి.రహదారులపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇంటర్ పరీక్షలు రాసేందుకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎర్రవాగు, ఉప కాలువలు పొంగి కందుకూరు నుంచి గోపాలపురం, షామిరిపాలెం, పాలురు, ఆనందపురం గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. కందుకూరు -కొండముడుసుపాలెం మధ్య ఎర్రవాగు ఉధృతిగా ప్రవహిస్తోంది. రాత్రి నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కందుకూరు, శామిర్ పాలెం మధ్య వాగు పొంగి ప్రవహించడంతో ఇంటర్ పరీక్షలు నలుగురు విద్యార్థులను పోలీసులు క్షేమంగా పరీక్షా కేంద్రాలకు చేర్చారు.
తుఫాను ప్రభావంతో ఉదయగిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల వల్ల పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. పంట పొలాలు నీట మునిగాయి. కనిగిరి-కావాలి మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. కొండాపురం మండలం రామానుజపురంలో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరి, స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
వర్షం కురుస్తుండటంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులుపడ్డారు. ఉలవపాడు మండలం వీరేపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలుగుదేశం నేతలు పరిశీలించారు. రైతులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. నెలరోజుల క్రితమే ధాన్యం తీసుకొచ్చినా...వర్షాలు వచ్చే వరకు ప్రభుత్వం కొనుగోలు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం మొత్తం కొనుగోలు చేయాల్సిందేనని లేదంటూ ఆందోళనకు దిగుతామని తెలుగుదేశం నేతలు హెచ్చరించారు..
ప్రకాశం జిల్లాలోనూ భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఒంగోలు మంగమూరు మధ్యలో ఉన్న నల్ల వాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. టంగుటూరు నుంచి రావివారిపాలెం వెళ్లే దారిలో పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. టంగుటూరు నుంచి ఆలకూరపాడు వెళ్లే మార్గంలో చప్టాపై ఉద్ధృతంగా నీరు ప్రవహిస్తోంది. దీంతో స్థానిక ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిద్దలూరు నియోజక వర్గంలోనూ పలుచోట్ల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నల్లమలలో కురిసిన వర్షాలకు గుండ్లకమ్మ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.. దీంతో కంభం చెరువుకు పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. కంభం మండలం ఎర్రబాలెం వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. కంభం, గిద్దలూరు రహదారిలోనూ రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అర్ధవీడు మండలం మోహిద్దిన్ పురం దశబందం కుంట కట్టకు స్వల్పంగా గండి పడింది. స్థానికులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. సింగరాయకొండలో లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. పోలీసుస్టేషన్‌లోకి వరద నీరు చేరింది.
కడప: అసని తుపాన్ కడప నగరాన్ని ముంచెత్తింది. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎడతెరపిలేకుండా కురిసిన వర్షానికి నగరం మొత్తం తడిచి ముద్దయ్యింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలైన రవీంద్రనగర్, భాగ్య నగర్ కాలనీ, శాస్త్రి నగర్, అక్కయ్యపల్లి, రామకృష్ణనగర్, గంజికుంట కాలనీ, తదితర ప్రాంతాలన్నీ నీటమునిగాయి. నివాసాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. నగరంలోని రోడ్లన్నీ మోకాలు లోతు వరకు వర్షపునీటితో నిండిపోయాయి. మురికి కాలువలు పొంగి ప్రవహించాయి.ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, భరత్ నగర్, కోర్ట్ రోడ్డు, ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం, అరవింద నగర్, ఓం శాంతి నగర్ తదితర ప్రాంతాలన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి..
శ్రీకాకుళం: జిల్లాలో మళ్లీ వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలోని నరసన్నపేట, జలుమూరు, సారవకోట మండలాల్లో వర్షం పడుతోంది.
ఇవీ చదవండి: కష్టపడే వారికి గుర్తింపు లేదా.. వైకాపా సమన్వయ సమావేశంలో కార్యకర్తలు