RAIN EFFECT IN MANIKONADA AND RAJENDRANAGAR: హైదరాబాద్ నగరంలో నిన్న కురిసిన భారీ వర్షాలకు పలు కాలనీలలోని అపార్టుమెంట్లు నీట మునిగాయి. మణికొండ పంచవటి కాలనీలోని ఓ అపార్టుమెంట్ సెల్లార్లోకి నీరు చేరింది. అందులో ఉన్న కార్లు, బైక్లు నీట మునిగిపోయాయి. మోటార్ల సాయంతో అపార్టుమెంట్ దిగువన ఉన్న నీటిని బయటకు పంపిస్తున్నారు. రహదారులపై కూడా నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు.
నగరంలో నిన్న అసలు ఎడతెరుపు లేకుండా ముంచెత్తిన వర్షానికి ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందిపడ్డారు. రహదారుల వెంబడి నడవడానికి ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉంటుందో, గతుకులు ఉంటాయోనన్న భయంతో బయటకు రావడమే మానేశారు. ఎటుచూసినా వర్షపు నీరే కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. నగర ప్రజలు, వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులపై భారీగా వరద చేరడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి.
నగరంలోని ప్రజలు విద్యుత్ లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా రాజేంద్రనగర్లోని ఉప్పార్పల్లి డీ మార్ట్ వద్ద రోడ్డుపైకి వరద నీరు రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను వేర్వేరు మార్గాల్లో పంపించారు. దీంతో రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎప్పుడు వర్షం పడ్డా ఇదే పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: