ఉత్తరాంధ్రలో లోటు వర్షపాతం నెలకొంది. విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లాలో 21.5% లోటు వర్షపాతం నమోదైంది. జిల్లాలో 38 మండలాలకు.. రెండు చోట్ల సాధారణం కంటే ఎక్కువగా, 17 చోట్ల సాధారణ వర్షపాతం, 17 చోట్ల లోటు, రెండుచోట్ల దుర్భిక్ష పరిస్థితులున్నాయి. విజయనగరం జిల్లాలోనూ 34 మండలాలకు ఆరు చోట్ల సాధారణం కంటే ఎక్కువగా, 18 చోట్ల సాధారణ వర్షపాతం నమోదైంది.
- వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో గురువారం అల్పపీడనం ఏర్పడనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా, ఏపీ విపత్తు నిర్వహణశాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. తీరం వెంబడి గంటకు 45- 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రంలో అలలు 3 మీటర్ల నుంచి 3.5 మీటర్ల ఎత్తుకు ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు. గురువారం నుంచి విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో ఒక మోస్తరు వానలు కురుస్తాయని తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లాలోని మన్యం భారీవర్షంతో తడిసి ముద్దయింది. బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. చింతూరు- వరరామచంద్రాపురం మండలాల మధ్య సోకులేరు వాగు, అత్తాకోడళ్లవాగు రహదారి పైనుంచి ప్రవహిస్తున్నాయి. దీంతో ఈ రెండు మండలాలతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆకుల వెంకటరమణ సోకులేరు వాగు ఉద్ధృతిని పరిశీలించి రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శబరి, గోదావరి నదులకు ఎగువ ప్రాంతాలనుంచి వరద రావడంతో వాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోయరు సీలేరు ప్రాజెక్టులోని ఫోర్‌బై, ఏవీపీ, డొంకరాయి తదితర జలాశయాలు గరిష్ఠ స్థాయికి చేరువలో ఉన్నాయి. వందలాది ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగాయి.
ఇదీ చదవండి: విశాఖ తీరానికి 25 వేల టన్నుల అమ్మోనియం నైట్రేట్