స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, పాటించాల్సిన నిబంధనలను ఎన్నికల సంఘం రూపొందించింది. ఎవరు అర్హులు, ఏ పరిస్థితుల్లో అనర్హత వేటు పడుతోందనే విషయాలను స్పష్టంగా తెలుపుతుంది. పంచాయతీ ఎన్నికలు -2021 బరిలో నిలవాలంటే ఎవరు అర్హులు, ఎవరు అనర్హులో ఓ సారి చూస్తే...!
అర్హులు...
- అభ్యర్థి వయసు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామపత్రాలు పరిశీలించే తేదీ నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి.
- పోటీ చేసే వ్యక్తి పేరు సంబంధిత ప్రాదేశిక నియోజకవర్గంలో ఓటర్ల జాబితాల్లో నమోదై ఉండాలి.
- అభ్యర్థి ముగ్గురు పిల్లలు కలిగి ఉండి నామపత్రాలు పరిశీలన రోజు ఒక పిల్లవాడు మరణిస్తే ప్రస్తుతం ఆ అభ్యర్థి సంతానం ఇద్దరు గానే భావించి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులుగా భావిస్తారు.
- నామపత్రాల పరిశీలన నాటికి ఇద్దరు పిల్లలు కలిగి ఉండి మళ్లీ గర్భిణి అయిన మహిళ పోటీకి అర్హురాలే. (నామినేషన్ పరిశీలన నాటికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు భావిస్తారు)
- నామపత్రాలు పరిశీలన రోజునాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉండరాదు. పోటీ చేయదలచిన అభ్యర్థి రాజీనామా చేయాలి.. ఆ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించాలి.
- గ్రామపంచాయతికి ఏదైనా ధర్మకర్త హోదాలో కాకుండా ఏవైనా బకాయిపడి ఉండరాదు.
- రాష్ట్ర శాసన సభల ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న ఏదైన చట్టం కింద అనర్హులుగా ప్రకటించి ఉండరాదు.
- చౌకధర దుకాణాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న రేషన్ డీలర్లు, అంగన్వాడీ సిబ్బంది, సహకార సంఘాల సభ్యులు, మత సంస్థల ఛైర్మన్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడు. దీనిపై న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
అనర్హులు...
- గ్రామ ఓటరు జాబితాలో పేరులేని పక్షంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు.
- ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి 1.6.1996 తర్వాత ముగ్గురు పిల్లలు కలిగి ఉన్న వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు.
- పిల్లలను దత్తత ఇచ్చినప్పుడు ఆ పిల్లలు సొంత తల్లిదండ్రులకు చెందిన వారిగానే పరిగణిస్తారు. పోటీ చేసే వ్యక్తి ముగ్గురు పిల్లలు కలిగి ఉండి ఒకరిని దత్తత ఇచ్చినా.. అతనికి ముగ్గురు పిల్లలుగా భావించి పోటీకి అనర్హుడిగా ప్రకటిస్తారు.
- ఒక వ్యక్తి మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలను కలిగి, భార్య మరణించిన తర్వాత రెండో భార్య ద్వారా మరో సంతానాన్ని పొందితే అతను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు.
- మతి స్థిమితం లేని వారు, చెవిటి , మూగవారై ఉండకూడదు.
- ఒక వ్యక్తి క్రిమినల్ న్యాయస్థానం ద్వారా దోషిగా తేలితే అతను ఆ రోజు నుంచి 5 ఏళ్ల వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హుడు.
ఇదీ చదవండి