అంతంతమాత్రం ఆదాయంతో పల్లెలు కునారిల్లుతున్నాయి. మౌలిక వసతులనూ సమకూర్చుకోలేకపోతున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని అనేక జిల్లాల్లో పన్నుల వసూళ్లు అంతంతే. పన్నేతర కేటగిరి (నాన్టాక్స్)లోనూ ఆదాయం నామమాత్రమే. కనీస వసతుల కల్పన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చే నిధులనే సర్దుబాటు చేసుకుంటున్నారు. పంచాయతీ నిధులతో 3,4 దశాబ్దాల్లో ఈ జిల్లాల్లో చెప్పుకోదగ్గ కార్యక్రమాలు చేపట్టలేదు. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో మాత్రం అత్యధిక గ్రామ పంచాయతీలు ఆర్థికంగా బాగున్నాయి. వీటిలో నివాస, వాణిజ్య పన్నుల వసూళ్లు బాగుండటం, జనాభా ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఎక్కువగా రావడం కలిసి వస్తోంది.
ఆదాయం తగ్గుతోంది
* రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పన్నులు, పన్నేతర విభాగాల్లో ఏటా రూ.750 కోట్ల వరకు వసూలు చేయాల్సి ఉంది. ఈ లక్ష్యంలో 65 శాతానికి కూడా చేరడం లేదు. కరోనా, ఏడాదిగా ఎన్నికల హడావుడి కారణంగా ఈ ఏడాది 50శాతమే వసూలయ్యాయి.
* ఇసుక రేవులను లోగడ గ్రామ పంచాయతీలు నిర్వహించేవి. వాటివల్ల ఏటా రూ.వేయి కోట్ల ఆదాయం వచ్చేది. రేవులను గనుల శాఖకు అప్పగించడంతో గ్రామపంచాయతీలకు వచ్చే ఆదాయం ప్రస్తుతం రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్లకు చేరింది. ఇసుక రేవులను ప్రస్తుతం గనులశాఖ వేలం వేస్తోంది. వచ్చిన ఆదాయంలో సీనరేజీ కింద పంచాయతీలకు 25 శాతం నిధులే ఇస్తోంది.
మూడే కీలకం
* ప్రతి పంచాయతీకి జనాభా ఆధారంగా తలసరి రూ.4 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.60 కోట్లు ఇస్తోంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పంచాయతీలకు ఈ నిధులు ఊరటనిస్తున్నాయి. రిజిస్ట్రేషన్లపై స్టాంపుడ్యూటీలో ఏటా మరో రూ.350 కోట్లు పంచాయతీలకు ఇస్తున్నారు.
* 15వ ఆర్థిక సంఘ నిధుల్లో 2020-21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని పంచాయతీలకు ఇప్పటివరకు రూ.1,300 కోట్లు విడుదలయ్యాయి. మరో రూ.1,325 కోట్లు రావాల్సి ఉంది. ఈ నిధులను పంచాయతీల్లో తాగునీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణ, పారిశుద్ధ్య పనులకు వెచ్చిస్తున్నారు.
* ఉపాధి పథకం (నరేగా) కింద ఈ ఏడాది కేంద్రం రూ.9,973 కోట్లు కేటాయించింది. ఇందులో కూలీలకు వేతనాల కింద రూ.5,984 కోట్లు, గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు ‘మెటీరియల్ కాంపోనెంట్’లో మరో రూ.3,989 కోట్లు కేటాయించారు. వీటిలో ఇప్పటివరకు 80 శాతానికిపైగా నిధులు వెచ్చించారు.
ఇలా చేస్తే మేలు
* పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఏర్పాటైన రాష్ట్ర ఆర్థిక కమిషన్ నుంచి గ్రామాలకు తగినన్ని నిధులను కేటాయిస్తే ప్రగతి పనులకు వీలుంటుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 4 ఆర్థిక కమిషన్లు ఏర్పాటైనా పంచాయతీలకు నిధులను కేటాయించే పరిస్థితి లేదు. కమిషన్ సిఫార్సులు అమలు కావడం లేదు.
* రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమం (ఎస్డీపీ), ఎంపీ నిధులు గ్రామ పంచాయతీలకు అప్పగించాలన్న ప్రతిపాదన కాగితాలకే పరిమితమవుతోంది. ప్రస్తుతం ఈ నిధులను వేర్వేరు ఏజెన్సీలు, వ్యక్తుల ఆధ్వర్యంలో గ్రామాల్లో వెచ్చిస్తున్నారు.
‘అత్యధిక గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు. కొన్ని చోట్ల పారిశుద్ధ్య సిబ్బందికీ జీతాలు సక్రమంగా చెల్లించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఏటా అందిస్తున్న నిధులను పెంచాలి. గ్రామీణాభివృద్ధికి బడ్జెట్లో ప్రత్యేక నిధులను కేటాయించాలి. పంచాయతీలకు ఇచ్చే సీనరేజీ, స్టాంపు డ్యూటీ పరిహార నిష్పత్తి పెరగాలి. పన్నుల వసూళ్లతోపాటు ఇతర ఆదాయ వనరులను పెంచుకునేలా గ్రామ పంచాయతీలు ప్రయత్నించాలి’
ఇదీ చదవండి