రాష్ట్రంలో మూడు జోన్లలో ఇసుక తవ్వకాలు, విక్రయాల టెండర్ దక్కించుకున్న జయప్రకాశ్ పవర్ వెంచర్స్ అనే ప్రైవేటు సంస్థ కార్యకలాపాల ఆరంభ తేదీని ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. తొలుత ఈ నెలలోనే ఉంటుందని భావించినా.. తాజాగా మే ఒకటి నుంచి బాధ్యతలు చేపడుతుందనే మాట వినిపిస్తోంది. మొత్తానికి ఆ సంస్థ బాధ్యతలు చేపట్టే తేదీపై ఎలాంటి ఆదేశాలు లేవు. అయినా.. ప్రస్తుతం ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) పరిధిలో ఇసుక రీచ్‌లు, నిల్వ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న 1,922 పొరుగుసేవల సిబ్బందిని తొలగించేందుకు ఆదేశాలు ఇచ్చారు. ఈ పొరుగుసేవలు అందిస్తున్న రెడ్డి ఎంటర్‌ప్రైజెస్‌కు ఈనెలాఖరుతో ఒప్పందం ముగుస్తుందని నోటీసులో పేర్కొన్నారు.
మే ఒకటి నుంచి జేపీ సంస్థ బాధ్యతలు తీసుకోకపోయినా, పొరుగు సేవల సిబ్బందిని కొనసాగించకపోయినా ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు చెబుతున్నారు. అన్ని ఓపెన్ రీచ్‌లు ప్రైవేటు సంస్థకు అప్పగించాల్సి ఉంటుందని కొద్ది రోజులుగా ఏపీఎండీసీ తవ్వకాలు నిలిపేసింది. ఇప్పుడు కొత్త పాలసీ అమలు తేదీపై స్పష్టత లేకపోవడంతో.. రెండు, మూడు రోజులుగా తవ్వకాలు పెంచింది. క్రమంగా ఓపెన్ రీచ్‌ల్లో తవ్వకాలు ప్రారంభించింది. ఆన్‌లైన్‌లో లభ్యత ఎక్కువ చూపుతోంది. నిత్యం 70-80 వేల టన్నులు చొప్పున బుకింగ్ అయ్యేలా చూస్తోంది. కానీ.. వర్షాకాల అవసరాల కోసం నిల్వలపై ఇప్పటి వరకు దృష్టి సారించలేదు. నెలైతే వర్షాకాలం మొదలు కానుండటంతో అధికారులు ఇప్పుడు హైరానా పడుతున్నారు. అన్ని జిల్లాల్లో కలిపి 30-40 లక్షల టన్నుల మేర ముందస్తు నిల్వలు ఉంచాలంటూ ఆదేశించారు.
ఇదీ చదవండీ..