తెలంగాణలోని సింగరేణి సంస్థ తొలిసారి ఇతర రాష్ట్రంలో చేపడుతోన్న మొదటి బొగ్గు గని నైనీ ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు అటవీశాఖ నుంచి తొలి దశ అనుమతి లభించింది. సింగరేణికి అటవీ భూమి కేటాయింపుపై ఒడిశా ప్రభుత్వ ప్రతిపాదనను పరిశీలించి.. 783.27 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించేందుకు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించిందని సింగరేణి సీఎండీ శ్రీధర్ వెల్లడించారు. ఈ మేరకు ఒడిశా రాష్ట్ర అటవీ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శికి ఈ నెల 28న ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. రెండో దశ అనుమతి లభించిన వెంటనే అటవీ భూమిని సింగరేణికి బదలాయించేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు.
ఒడిశాలోని అంగూల్ అటవీ డివిజన్ ప్రాంతంలోని ఛెండిపాద, కంకురుపాల్లో ఉన్న 643.095 హెక్టార్ల రిజర్వ్డ్ ఫారెస్టు భూమి, 140.18 హెక్టార్ల గ్రామ అటవీ స్థలాన్ని నైనీ ప్రాజెక్టుకు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం లభించినట్లయిందని సింగరేణి సీఎండీ వివరించారు. తాజాగా తొలి దశ అనుమతులు లభించడంతో ఈ ఆర్థిక సంవత్సరం నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభానికి మార్గం సుగమం అయిందన్నారు.
'2014లో సింగరేణికి నైనీ ప్రాజెక్టు'
సింగరేణికి 2014లో ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది సంస్థకు లాభసాటిగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో బొగ్గు బయటకు తీయడానికి అనుకూల పరిస్థితులున్నాయి. 2020లో ఉత్పత్తి చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. గతేడాది నుంచి అన్వేషణ పనులు చేపట్టిన సింగరేణి ఈ ఏడాదిలో పూర్తి స్థాయిలో నివేదికలను తయారు చేసింది. ఒకవైపు అనుమతుల కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు భూసేకరణ చేస్తోంది.
తక్కువ ఖర్చుతో ఉత్పత్తి..
ప్రస్తుతం సింగరేణిలో ఉన్న గనులన్నీ లోతైన ప్రాంతంలో ఉన్నాయి. 6 నుంచి 10క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగిస్తేనే టన్ను బొగ్గును వెలికితీసే అవకాశం ఉంది. నైనీలో మాత్రం అతి తక్కువ లోతుల్లో నిక్షేపాలు గుర్తించారు. పైపొరల్లోనే బొగ్గు ఉన్నట్లు ప్రాథమిక అన్వేషణలో తేలింది. 2 నుంచి 3 క్యూబిక్ మీటర్ల మట్టిని మాత్రమే తీయాల్సి ఉంటుంది. దీంతో మట్టి తొలగించే ఖర్చు భారీగా తగ్గుతుంది. టన్ను బొగ్గు ఉత్పత్తికి ఇక్కడైతే రూ.2400 ఖర్చు అవుతుంది. అదే అక్కడైతే రూ.800 అవుతుందని అంచనా వేస్తోంది. అదేవిధంగా నాణ్యమైన ఖనిజం లభించే అవకాశం ఉండటంతో అక్కడి నైనీ ఉపరితల గని లాభసాటిగా ఉంటుందని సంస్థ భావిస్తోంది.
ఏటా 10మిలియన్లు..
నైనీ బ్లాక్ ఎక్కువగా అటవీ ప్రాంతంలోనే ఉంది. 650 హెక్టార్లలో విస్తరించి ఉంది. 490 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్లు గుర్తించారు. త్వరలోనే భూ సేకరణ పనులు పూర్తి చేయనున్నారు. పర్యావరణ అనుమతులు రాగానే మట్టి వెలికితీత చేపడతారు. ఏడాదిలోనే ఉత్పత్తి ప్రారంభించనున్నారు. ఏటా 10మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీసేందుకు ప్రణాళికలు చేసుకుంటున్న సింగరేణి సుమారుగా 49ఏళ్ల పాటు ఇక్కడ తమ కార్యకలాపాలను సాగిస్తుంది.
రెట్టింపు లాభాలు..
ప్రస్తుతం ఉపరితల గనుల్లో సాధిస్తున్న లాభాల కంటే రెట్టింపు స్థాయిలో నైనీ, న్యూపాత్రపాద బొగ్గు బ్లాక్‌లో ఆర్జించే అవకాశం ఉంది. మట్టి తొలగింపు భారం తక్కువగా ఉండటంతో ఖర్చు తక్కువగా ఉంటుంది. బొగ్గు పొరలు పైపైనే ఉండే అవకాశం ఉండటంతో వెలికి తీయడానికి కూడా ఇబ్బంది ఉండదు. అందుకే సింగరేణి ఒడిశా వైపు అడుగులు వేస్తోంది.
మరిన్ని గనుల కోసం..
ఇప్పటికే నైనీ, న్యూపాత్రపాదను దక్కించుకుంది. ఇవేగాక ఆ ప్రాంతంలోని మహానది, జామ్‌కని, మచ్చాఖట, బిజాహాన్, రాధికాపూర్ బ్లాక్‌లను కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వేలం ద్వారా బ్లాక్‌లను ఇవ్వాలని నిర్ణయించింది. అవసరమైతే అందులో పాల్గొని దక్కించుకోవాలని భావిస్తోంది సింగరేణి.