గ్రేటర్ హైదరాబాద్‌లో ఓ మోస్తారు వర్షం కురిస్తే చాలు నగరం అంధకారమవుతుంది. రాత్రిళ్లు కరెంటు పోయిందని ఫిర్యాదు చేసినా విద్యుత్ సిబ్బంది స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏటా వేసవికాలంలోనే విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర నిర్వహణ కోసం విద్యుత్‌శాఖ పెద్ద ఎత్తున తీగలపై ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తుంది. ఇలా చేయడం వల్ల భారీ వర్షాలు పడినా.. సరఫరాలో ఎటువంటి అంతరాయం ఏర్పడదు. మరమ్మత్తుల సమయంలో పనిచేయని వాటిని తొలగించి కొత్తవి అమర్చుతుంటారు. వీటి కోసం నిర్వహణ వ్యయం కింద ప్రతి ఏడాది కనీసం రూ.200కోట్లు వెచ్చించి పనులు చేస్తేనే వర్షాకాలంలో నిరంతర సరఫరాను అందించవచ్చు. ప్రస్తుతం ఆన్‌లైన్ తరగతులకు ఇబ్బందిగా మారిందని తల్లిదండ్రులు వాపోతున్నారు
700 కిలోమీటర్ల పైచిలుకు ప్రమాదకర లైన్లు
గ్రేటర్ పరిధిలో సుమారు 700 కిలోమీటర్ల పైచిలుకు ప్రమాదకర లైన్లు ఉన్నాయని అధికారుల అంచనా. వాటిని మార్చేందుకు 2015లోనే రూ.284.91కోట్ల వ్యయం అవుతుందని... అది 2020 నాటికి సుమారు రూ.400 కోట్లు అని అధికారులు లెక్కలు వేశారు. విద్యుత్ శాఖ సాంకేతికపరమైన తనిఖీలను వదిలేసి బిల్లింగ్, వసూళ్లపైనే దృష్టిసారిస్తున్నారని... ఫలితంగా సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
వందలాది కాలనీల్లో అంధకారం ..
ఇటీవలి వర్షాలకు విద్యుత్ తీగల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో వందలాది కాలనీల్లో అంధకారం నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పది గంటల తర్వాత కరెంట్ పోతే తిరిగి ఉదయమే వస్తుందంటున్నారు. విద్యుత్ తీగల్లో పగుళ్లు, కండక్టర్‌లో సమస్యలు, విద్యుత్ స్థంబాల వద్ద డిస్క్‌లను శుభ్రం చేయకపోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. కేవలం చెట్లకొమ్మలు నరకడంతో... వర్షం పడగానే విద్యుత్ ట్రిప్ అవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు నిరంతరం విద్యుత్‌ను పరిశీలించాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో అమలు కాని ఆదేశాలు ..
ఏటా వర్షాకాలంలో ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడం... ఆ తర్వాత మర్చిపోవడం సాధారణమేనని నగరవాసులు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆదేశాలు పాటించకపోవడంతోనే సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని వాపోతున్నారు.
ఇవీ చూడండి: cm jagan review: వచ్చే నెలలో విశాఖ, అనంతలో 'అమూల్': జగన్