జస్టిస్ నూతలపాటి వెంకట రమణ స్వగ్రామమైన కృష్ణా జిల్లాలోని పొన్నవరంలో విజయ శోభ నిండింది. వీరులపాడు మండలంలోని ఉంది పొన్నవరం గ్రామం. ఇక్కడే ఓ సాధారణ రైతు కుటుంబంలో జస్టిస్ ఎన్వీ రమణ జన్మించారు. స్థానిక వీధిబడిలో చదువుకున్నారు. జస్టిస్ రమణ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయికి ఎదిగారన్న వార్త... ఆయన చదివిన బడిలోనే ప్రస్తుతం విద్యాభ్యాసం సాగిస్తున్న పిల్లల్లో స్ఫూర్తి నింపింది.
'జస్టిస్ ఎన్వీ రమణ సార్ మా పాఠశాలలో చదువుకోవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఆయన స్ఫూర్తిగా తీసుకుని మేం కూడా బాగా చదువుకుంటాం. భవిష్యత్తులో మంచి హోదాలో ఉండాలని కోరుకుంటున్నాం.'- ఎన్వీ రమణ చదువుకున్న పాఠశాలలోని విద్యార్థులు
బాల్య స్నేహితుల అంతరంగం...
ఒకప్పుడు తమలో ఒకరుగా కలిసి ఆడుకున్న బాలుడు దేశానికే న్యాయ నిర్దేశకుడిగా మారడం పట్ల జస్టిస్ ఎన్వీ రమణ బాల్య స్నేహితుల్లో విజయానందం వ్యక్తమవుతోంది.
'నాతో బాగా సన్నిహితంగా ఉండేవారు. చిన్నప్పట్నుంచి కలిసి చదువుకున్నాం.1 నుంచి 5వ తరగతి వరకు పొన్నవరం పాఠశాలలో చదువుకున్నారు. బాగా ప్రసంగాలు ఇచ్చేవారు. ఇప్పటికీ గ్రామానికి వస్తే పిలిచి పక్కన కూర్చొబెట్టుకుని మాట్లాడుతారు'- బాల్య స్నేహితుడు
'చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్లం. తరువాత ఎన్వీ రమణ కంచికచర్లకు వెళ్లారు. ఇప్పటికీ మా గ్రామానికి వస్తే నన్ను పిలుస్తారు. మా యోగాక్షేమాలను అడిగి తెలుసుకుంటారు. గ్రామంలోని శివాలయానికి తప్పకు వస్తారు.' - భరద్వాజ్, బాల్య స్నేహితుడు
స్వతంత్ర పార్టీ అంటే ఇష్టం...
చిన్నప్పటి నుంచే చదువులో అందరికంటే ముందుండేవారని జస్టిస్ ఎన్వీ రమణ సహాధ్యాయులు గుర్తు చేసుకుంటున్నారు. జై ఆంధ్ర ఉద్యమం సమయంలోనూ చురుకుదనం ప్రదర్శించారన్న వారు.... రాజకీయ రంగంలో రాణించాలనే సంకల్పం జస్టిస్ ఎన్వీ రమణలో కనిపించేదని చెబుతున్నారు. ఉద్ధండులతో కూడిన స్వతంత్ర పార్టీ వైపు మొగ్గు చూపేవారని తెలిపారు.
'స్నేహితులుగా కలిసిమెలిసి ఉండేవాళ్లం. చిన్నప్పట్నుంచి కూడా ఆయనకు నాయకత్వ లక్షణాలు ఉండేవి. న్యాయవ్యవస్థ వైపు వెళ్లాలనే ఆలోచన అప్పట్లో ఉండేది కాదు. ఎన్వీరమణకు రాజకీయ నాయకుడు కావాలనే తపన ఉండేది. స్వతంత్ర పార్టీ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆచార్య రంగా రచనలు బాగా చదివేవారు. మాతో కూడా కూడా చదివించేవారు. మా అందరితో కూడా ప్రసంగాలు ఇప్పించేవారు. ఆయన 6వ తరగతి చదువుతున్నప్పుడే.. పదో తరగతికి సంబంధించిన పుస్తకాలను కూడా చదివేవారు. గొప్ప మానవతావాది.' - సాయిరాజా, బాల్య స్నేహితుడు
అయినవారికి ఆపన్నహస్తం అందించేందుకు, స్వగ్రామం అభివృద్ధికి జస్టిస్ ఎన్వీ రమణ ఎప్పుడూ ముందే ఉండేవారని గ్రామస్థులు తెలిపారు.
ఇదీ చదవండి