పీజీ వైద్య విద్యకు నూతన ఫీజుల విధానాన్ని తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విధానంలో ఫీజులు 15శాతం నుంచి 20 శాతం వరకు తగ్గే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉన్న ఒకే ఫీజు విధానానికి స్వస్తి పలికి... కళాశాలల వారీగా వసూలు చేయనున్నారు. వైద్య విద్య ప్రమాణాలు, ప్రత్యేక గుర్తింపులు పరిగణనలోకి తీసుకుని ఏపీ ఉన్నత విద్య, నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ కొత్త ఫీజుల కసరత్తు పూర్తి చేసింది. పీజీ మెడికల్ మొదటి విడత కౌన్సెలింగ్‌కు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సన్నద్ధమవుతోంది. జీవో 43పై రాష్ట్ర ప్రభుత్వం మార్గనిర్దేశకాలు జారీ చేసిన వెంటనే... ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ వెల్లడిస్తామని విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు.
కౌన్సెలింగ్ ప్రక్రియలో కీలకమైన సీట్ మ్యాట్రిక్స్‌ను విడుదల చేసేందుకు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ సన్నద్ధమైంది. భారతీయ వైద్య మండలి నిబంధనల మేరకు రాష్ట్రంలో పీజీ మెడికల్, డెంటల్ ప్రవేశాలను మే 31 లోగా ముగించాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఈ గడువును జూన్ 30 వరకు పొడిగించాలని అన్ని రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు కోరాయి. దీనిపై ఎంసీఐ ఇంకా ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు.