Yadadri brahmotsavalu 2022: తెలంగాణలో యాదాద్రీశుల వార్షిక బ్రహ్మోత్సవాలు మూడో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. లక్ష్మీసమేత నారసింహుడు మత్స్యావతారంలో బాలాలయంలో భక్తులకు దర్శనమిచ్చారు. 11రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలు ఈనెల 14వ తేదీన ముగుస్తాయి. స్వయంభువులైన పంచనారసింహుల ఆలయ పునర్నిర్మాణం జరుగుతుండటంతో ప్రత్యామ్నాయంగా ఏర్పాటైన బాలాలయం లోపలే కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన పురోహితులు.. అనంతరం వేదపారాయణాలు, వేదపండితుల చేత మహోత్సవాన్ని కన్నుల పండువగా, వీనుల విందుగా జరిపించారు. అనంతరం స్వామివారిని మత్స్యావతారంలో అలంకరించి బాలాలయ తిరువీధుల్లో ఊరేగించారు. ఈ మహోత్సవంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని విద్యుత్ దీపాల అలంకరణతో ముస్తాబు చేశారు. బాలాలయ ప్రాంగణం, పరిసరాల్లో రాత్రి వేళలో కాంతులు విరజిమ్మేలా విద్యత్ దీపాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొండకింద పట్టణంలో ప్రధాన రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ.. వెలుగులు సంతరించుకొని చూపరులను ఆకట్టుకుంటోంది.
ఇదీ చదవండి: అమరావతినే రాజధానిగా అసెంబ్లీలో ప్రకటించాలి: సీపీఐ రామకృష్ణ