వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు.. ఆ పార్టీ షోకాజ్ నోటీసులు జారీచేసింది. ప్రభుత్వం పథకాలు, పార్టీ విధానాలపై బహిరంగంగా విమర్శలు చేశారన్న ఆరోపణలపై నోటీసులు ఇచ్చినట్లు ప్రకటించింది. వారం రోజుల్లో వివరణ ఇవాల్సిందింగా ఆదేశించింది. సమాధానం ఇవ్వని పరిస్థితుల్లో పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని నోటీసులో హెచ్చరించింది. వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఈ నోటీసు జారీ చేశారు.
దారి తీసిన పరిస్థితులు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైకాపాలో కలకలం రేపాయి. ఆంగ్ల మాధ్యమంపై లోక్‌సభలో ఎంపీ చేసిన వ్యాఖ్యలు మొదలు... తనకు ప్రాణహాని ఉందని లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ చేసిన ఫిర్యాదు వరకు... పార్టీలో కలకలం కొనసాగింది. సీఎం జగన్ ను ఉద్దేశించి ఎంపీ చేసిన వ్యాఖ్యలు, ఎంపీ చెప్పినట్లు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను పరిగణలోకి తీసుకుని, ఎంపీ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా వైకాపా షోకాజ్ నోటీసు జారీచేసింది.