ఎవరైనా ప్రాణాపాయస్థితిలో ఉంటే.. 108కే ఫోన్ చేస్తారు. కానీ ఇప్పుడు ఆ 108 వాహన సిబ్బంది కుటుంబాలే దాదాపు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. నెలల తరబడి వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 3 నెలలుగా జీతాలు రాక వారి కుటుంబ పోషణ భారంగా మారింది. ఇంటి అద్దెలు, కిరాణా ఖర్చులు, పిల్లల ఫీజులు కట్టలేక సతమతమవుతున్నారు. ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదు.. రాష్ట్రంలో 108, 104లో పనిచేస్తున్న సిబ్బంది అందరిదీ ఇదే దయనీయస్థితి.
రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి 108 వాహనాలు ఉండగా.. వీటిల్లో 3 వేల మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. అలాగే 104 వాహనాలు 700 దాకా ఉంటాయి. వీటిలో మరో 2 వేల మంది సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం ఈ అంబులెన్సుల సేవలు.. అరబిందో సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. వీరందరికీ 3 నెలలుగా వేతనాలు అందక...ఇంట్లో నిత్యావసరాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి. జీతాల కోసం అడిగి విసిగిపోయిన సిబ్బంది ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. రెండు, మూడు రోజులుగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తూనే విధులు నిర్వర్తిస్తున్నారు. అరబిందో సంస్థ మాత్రం తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాలేదని....అందుకే వేతనాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పడం గమనార్హం.
వేతనాలు రాక అప్పు పుట్టక 108, 104 సిబ్బంది పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. క్రెడిట్ కార్డులు, రుణ యాప్‌ల నుంచి అధిక వడ్డీలకైనా సరే తప్పక అప్పులు తీసుకుంటూ రోజులు గడుపుతున్నారు. కుటుంబపోషణకు తంటాలు పడుతున్నారు. ఒక సంస్థ ఇచ్చిన అప్పును తీర్చడానికి మరో యాప్ నుంచి రుణం తీసుకుంటూ పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ జిల్లాలో దాదాపు 51 అంబులెన్సులు 108 సేవలను అందిస్తుండగా 240 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. వేతనాలు సహా ఇతర సమస్యలపై అరబిందో సంస్థ ప్రతినిధులు హామీలు ఇచ్చినా అవి అమలు కాక తీవ్ర ఇక్కట్లు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈఎంటీలుగా పనిచేస్తున్నవారిని ఒప్పంద ఉద్యోగులుగా పరిగణించి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. మూడేళ్ల క్రితం 108 అంబులెన్స్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి.. పైలెట్ల జీతాలను రూ. 28 వేలు, ఈఎంటీ వేతనాలను రూ. 30 వేలకు పెంచుతామని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని ఆవేదన చెందుతున్నారు. పీఎఫ్ సొమ్మునూ ఉద్యోగుల జీతం నుంచే కట్ చేస్తున్నారని వాపోతున్నారు.
తిరుపతిలోనూ మహిళా ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. సకాలంలో వేతనాలు అందక, కుటుంబానికి సమయం కేటాయించలేక నానా ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. 108 వాహనాలు నిలిపి ఉంచే చోట్ల.. కనీస సదుపాయాలూ ఉంటడం లేదని ఆవేదన చెందుతున్నారు. 108 సేవల సిబ్బంది పోరాటానికి కార్మిక సంఘాల నేతల మద్దతు లభించింది. తక్షణం వేతనాలు చెల్లించకుంటే సమ్మె తప్పదని తిరుపతి సీఐటీయూ నాయకులు హెచ్చరిస్తున్నారు. వేతనాల పెంపుతో పాటు ప్రభుత్వానికి సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్న అన్ని డిమాండ్లనూ పరిష్కరించాలని 108 సిబ్బంది పట్టుపడుతున్నారు. ప్రశ్నించినవారిపై క్రమశిక్షణ చర్యల పేరిట వేధింపులకు పాల్పడవద్దని కోరుతున్నారు.
ఇదీ చదవండి: