పూర్వ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేశారు. తన నియామకంపై అత్యున్నత న్యాయస్థానం మే 25 న ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయట్లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయాల్సిన అధికార యంత్రాంగమే బేఖాతరు చేస్తున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు.
తన వ్యవహారంలో న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలు అమలుకాకపోవటం, అధికారుల వ్యవహారశైలిని పిటిషన్లో ప్రస్తావించారు. తన స్థానంలో ప్రభుత్వం కొత్తగా నియమించిన జస్టిస్ కనగరాజ్ కోర్టు ఆదేశాల తర్వాత కూడా ఎస్ఈసీగానే వ్యవహరిస్తున్నారని తెలిపారు. అలాగే.. ఎస్ఈసీ రవాణా కోసం కేటాయించిన వాహనాన్ని ఇప్పటికీ కనగరాజ్ పరిధిలోనే ఉంచటం సమంజసం కాదని వివరించారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ప్రభుత్వంతో పాటు సంబంధిత అధికారులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు.
కోర్టు ఆదేశాల అమలును జాప్యం చేయడంపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో పాటు ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణిమోహన్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాతే కోర్టులో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రభుత్వంపై ధిక్కరణ పిటిషన్ వేశారు.
గవర్నర్‌కు రాసిన లేఖలో...
ఎన్నికల కమిషనర్‌గా తనని గుర్తిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ రాష్ట్ర గవర్నర్‌కు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖ రాశారు.
లేఖలో పేర్కొన్న అంశాలు
ఎన్నికల కమిషనర్‌గా తనను నియమించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు అమలు చేయడం లేదంటూ గవర్నర్ బిశ్వభూషణ్‌కు నిమ్మగడ్డ లేఖ రాశారు. ఇదే కేసులో సుప్రీంకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎన్నికల కార్యదర్శి, ఇతర అధికారులు తన నియామకాన్ని అమలు చేయటం లేదని తెలిపారు. సమస్యను ఈనెల 11న సీఎస్ దృష్టికి తీసుకెళ్లానని వివరించారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని...అడ్డంకులను తొలగించేలా చూడాలని బిశ్వభూషణ్‌ను కోరారు.
మా అమ్మకు వైద్య సహాయం అందించాలి....
'మా స్వగ్రామం గుంటూరు జిల్లాలోని దుగ్గిరాలలో 84 ఏళ్ల మా అమ్మ ఉంటుంది. ఇటీవలే ఆమె జారి పడటంతో విజయవాడలో శస్త్ర చికిత్స చేశారు. వృద్ధురాలైన ఆమెకు వైద్య ఆరోగ్యపరమైన సహాయక చర్యలు అందిచాల్సిన బాధ్యత ఏకైక కుమారుడిగా నాపై ఉంది. దీని కోసం ప్రత్యక్షంగా నేను అక్కడికి వెళ్లాలి. ఈ కరోనా వేళ నా ప్రయాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయాల్సిన అనుమతిపై సందేహాం కలుగుతోంది. ఈ పరిస్థితుల్లో మీ సలహా, జోక్యం కోసం ఎదురుచూస్తున్నాను' - నిమ్మగడ్డ రమేశ్ కుమార్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్
సీఎస్ దృష్టికి...
ఎస్ఈసీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ తనని ఎన్నికల కమిషనర్‌గా పునరుద్ధరించటం లేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నిమ్మగడ్డ లేఖ రాశారు. ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణిమోహన్‌కు ఎన్నికల కమిషనర్‌గా ఫోన్ చేసి ఇదే విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. కరోనా విస్తరిస్తున్నందున రవాణా సౌకర్యం కోరినా... స్పందన లేదన్నారు. ఎస్ఈసీ ఆదేశాలను కార్యదర్శి తప్పక పాటించాల్సిన అవసరం ఉంటుందని లేఖలో వివరించారు. తన నియామకం పునరుద్ధరణపై కార్యదర్శి విముఖతను గమనించానని చెప్పారు. ఎస్ఈసీ ఆదేశాలు పరిగణలోకి తీసుకోకపోవడం సరికాదనే విషయాన్ని మీరు కూడా అంగీకరిస్తారని అనుకుంటున్నానని అన్నారు. అందుకే ప్రత్యేకంగా ఈ విషయాలు మీ దృష్టికి తీసుకువచ్చానని వెల్లడించారు.
ఎస్ఈసీ కార్యదర్శి తటస్థ వైఖరి అవలంభించటం లేదు: నిమ్మగడ్డ
'మీరు తటస్థ వైఖరి అవలంభించట్లేదని మీ చర్యల ద్వారా తెలుస్తోంది. ఎస్ఈసీగా తనని పునరుద్ధరించటంలో ఎన్నికల కార్యదర్శిగా మీరు నిష్క్రియను ప్రదర్శిస్తున్నట్టు మీ చర్యలు చెబుతున్నాయి. కోర్టు తీర్పు అనంతరం కూడా జస్టిస్ కనగరాజ్‌కు కారు, అటెండర్ సౌకర్యాలు కల్పిస్తున్నారనేది బహిరంగ వాస్తవం. మీ చర్యలతో జస్టిస్ కనగరాజ్ ఇప్పటికీ డిఫ్యాక్టో సీఈసీగా కొనసాగుతున్నారు. ఎస్ఈసీకి కేటాయించిన కారును మీరు కనగరాజ్‌కు కేటాయించటం... ఆయన వినియోగించటం కోర్టు ఆదేశాల ఉల్లంఘనే. దీనికి మీరే జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది. మీకు న్యాయబద్ధంగా ఉన్న అన్ని అవకాశాలు వినియోగించుకోవటంలో విఫలమైనట్లే కనిపిస్తోంది. ఈ లేఖను ఇప్పటికైనా చివరి అవకాశంగా పరిగణలోనికి తీసుకోండి. లేకపోతే న్యాయపరంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ విషయాలన్నింటినీ సీఎస్ దృష్టికి తీసుకెళ్లాను. చట్టానికి బద్ధులుగా ఉండాలని మరోసారి సూచిస్తున్నాను'.- నిమ్మగడ్డ రమేశ్ కుమార్, ఎస్ఈసీ
ఇదీ చదవండి: