Newly Wed Groom Suicide in Khammam : పెళ్లింట పెను విషాదం. వివాహమైన రెండో రోజే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దైవ దర్శనానికి వెళ్లే క్రమంలో అందర్నీ తెల్లవారుజామునే నిద్రలేపి.. తాను మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరా మండలంలో సోమవారం వేకువజామున ఈ విషాదం జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. వైరా మండలం పుణ్యపురం గ్రామానికి చెందిన కమ్మంపాటి నరేశ్(29)కు, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం ఆర్లపాడుకు చెందిన యువతితో ఈ నెల 4న వివాహం జరిగింది. తర్వాత రోజు ఆదివారం వరుడి స్వగ్రామంలో రిసెప్షన్ నిర్వహించారు. ఆ వేడుకలోనూ నరేశ్ సంతోషంగా గడిపాడు. సహచరులతో కలిసి నృత్యం చేశాడు. వధూవరులు, దగ్గరి బంధువులు సోమవారం ఉదయం విజయవాడ సమీపంలోని గుణదలకు దైవదర్శనానికి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. అందుకోసం నరేశ్ అద్దె కార్లు మాట్లాడాడు.
Newly Wed Groom Suicide in Punyapuram : తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి..బంధువులందర్నీ లేపాడు. స్నానంచేసి వస్తానంటూ గదిలోకి వెళ్లాడు. బంధువులు ప్రయాణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బయల్దేరే సమయం వచ్చినా నరేశ్ కన్పించకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో స్నానాల గది తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. రక్తపు మడుగులో కన్పించడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. బ్లేడుతో చెయ్యి, గొంతు కోసుకుని మరణించినట్టు గుర్తించారు.
తల్లి రెక్కల కష్టంతో.. నరేశ్ తల్లి నాగమ్మ ఆశా కార్యకర్త. భర్త నాగేశ్వరరావు కొన్నేళ్ల క్రితమే చనిపోగా, ఆమె తన రెక్కల కష్టంతో కుమార్తె, ఇద్దరు కుమారులను పోషిస్తున్నారు. పెద్ద కుమారుడికి వివాహమైంది. చిన్న కుమారుడు నరేశ్ ఆరేళ్ల క్రితమే బీటెక్ పూర్తిచేశాడు. ప్రైవేటు ఉద్యోగం చేస్తూనే గ్రూప్స్‌కు శిక్షణ తీసుకున్నాడు. పెళ్లి కుదిరిన నేపథ్యంలో కొద్ది రోజులుగా ఇంటి వద్దనే ఉంటున్నాడు. పెళ్లికి ముందు, తర్వాత బంధువులు, సన్నిహితులతో సంతోషంగానే గడిపిన అతను ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి :
విజయవాడలో రెచ్చిపోయిన వైకాపా కార్పొరేటర్ వర్గీయులు.. పార్క్ సిబ్బందిపై దాడి
జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు.. ఈనెల 28 నుంచి ఇప్పటిదాకా..!
Rape: కాకినాడలో దారుణం.. బాలికపై ప్రైవేటు వసతిగృహం నిర్వాహకుడు అత్యాచారం