న్యూ డెవలెప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) నిధుల ద్వారా చేపట్టే రహదారుల ప్రాజెక్టు టెండర్లు ప్రభుత్వం రద్దు చేసింది. టెండర్ల ప్రక్రియపై ఆరోపణలు వస్తున్నందునే ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది. 6,400 కోట్ల వ్యయంతో 3 వేల కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి కోసం తలపెట్టిన ప్రాజెక్టు టెండర్లు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు వారంలో మరోసారి టెండర్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని రోడ్లు, భవనాలశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి కృష్ణబాబు స్పష్టం చేశారు. టెండర్ల దాఖలులో ఎవరూ భయాందోళనకు గురికాలేదన్న ఆయన... ఎక్కువ విలువైన పనుల్లో గుత్తేదార్లు తక్కువ సంఖ్యలో పాల్గొంటారన్నారు. ఎన్డీబీ ద్వారా చేపట్టిన పనులను 26 ప్యాకేజీలుగా పిలిచామని తెలిపారు. మరింత మందికి అవకాశం కల్పించేందుకే రీ టెండర్లు పిలుస్తున్నామని కృష్ణబాబు చెప్పారు.
ఆర్థిక అర్హతలు బేరీజుతో పనులు అప్పగింత
ఎన్డీబీ టెండర్లపై తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ఉండేందుకే రీ టెండర్ల ప్రక్రియని ఆయన పేర్కొన్నారు. రోడ్ల నిర్మాణం జాప్యమైనా పర్వాలేదని సీఎం చెప్పారన్న కృష్ణబాబు... గుత్తేదారులతో సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. బిల్లుల చెల్లింపుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న ఆయన... ప్రాజెక్టుకు నిధుల కొరత ఉండదని పేర్కొన్నారు. ప్రతి టెండర్ ప్రపంచ బ్యాంకు నిబంధనల మేరకే నిర్వహిస్తున్నారు. గుత్తేదారులకు పనులు అప్పగింతలో ఆర్థిక అర్హతలు బేరీజు వేస్తామన్నారు. ఈ టెండర్ దాఖలు చేసినా హార్డ్ కాపీలు ఇవ్వాలని సూచించామన్న ఆయన... సెప్టెంబర్‌తో సమయం ముగిసినా కేంద్రాన్ని సమయం కోరామని చెప్పారు.
పారదర్శకతతో టెండర్ ప్రక్రియ
ఈ టెండర్ ప్రక్రియ పారదర్శకతతో నిర్వహిస్తున్నామని కృష్ణబాబు తెలిపారు. ప్రాజెక్టుల విషయమై గుత్తేదారులతో మరోసారి మాట్లాడతామన్న ఆయన.. అర్హత ఉన్న గుత్తేదారుల విషయమై మరోసారి పరిశీలిస్తామన్నారు. జాతీయ ప్రాజెక్టుల్లో గుత్తేదారులు ఇతర దేశాల్లోనూ ప్రాజెక్టులు చేస్తున్నారని చెప్పారు. గుత్తేదారుల విషయమై ప్రపంచ బ్యాంకు కొన్ని నిబంధనలు పెట్టిందని ఆయన పేర్కొన్నారు. ఐదేళ్లలో రెండుసార్లు రూ.వంద కోట్ల టర్నోవర్ కంపెనీ సాధించాలని, కనీస టర్నోవర్ లేని కంపెనీలు.. పెద్ద పనులు ఎలా చేయగలవనే విషయం ఆలోచించాలని కృష్ణబాబు అన్నారు.
ఇదీ చదవండి : దేవుడి సొమ్మును ప్రభుత్వానికి తరలిస్తున్నారు: భానుప్రకాశ్ రెడ్డి