వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి ఫైర్ అయ్యారు. నేర చరిత్ర కలిగిన ఇద్దరు తనపై రాష్ట్రపతికి, ప్రధానికి లేఖ రాశారని విమర్శించారు. రూ.43 వేల కోట్లు దోచిన కేసులున్నవాళ్లు తనపై ఆరోపణలు చేశారని దుయ్యబట్టారు. జులై 26న సీబీఐ కోర్టులో అన్నీ తేలుతాయని వ్యాఖ్యానించారు. దొంగలంతా కలిసి ఆరోపణలు చేస్తున్నారన్న రఘురామ.. తనపై తమిళనాడులో కేసులకు జగన్, బాలశౌరి కారణమని ఆరోపించారు. తన గురించి అన్నీ తెలిసి టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. 16 నెలలు జైలులో ఉండి పదేళ్లు బెయిల్‌పై ఉంటున్నారంటూ ఘాటుగా స్పందించారు. విశాఖలో విజయసాయిరెడ్డి లూటీ చేస్తున్నారన్నారు. వీటన్నింటిపై రాష్ట్రపతి, ప్రధానికి వివరంగా లేఖ రాస్తానని చెప్పారు. అన్ని అంశాలు పక్కనబెట్టి తనపై అనర్హత వేటు వేయాలనే అడుగుతున్నారని రఘురామ ఆక్షేపించారు.
సీబీఐ కోర్టులో రఘురామ పిటిషన్.. ఏంటంటే..?
అక్రమాస్తుల కేసుల్లో నిందితుడిగా ఉన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం ఇచ్చిన బెయిల్ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన పిటిషన్లో ఆరోపించారు. సుమోటోగా లేదా దర్యాప్తు సంస్థ పిటిషన్ తో పాటు ఇతరుల పిటిషన్ ద్వారా కూడా బెయిల్ రద్దు చేయవచ్చునని గతంలో సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు పేర్కొన్నాయని రఘురామకృష్ణరాజు అన్నారు. కాబట్టి బెయిల్ రద్దు కోసం పిటిషన్ వేసేందుకు తాను అర్హుడినేనన్నారు. సాక్షులను ప్రభావితం చేయవద్దన్న ప్రధాన షరతును జగన్ ఉల్లంఘించారని ఆరోపించారు. ఎలాంటి షరతులైనా పాటిస్తానని, విచారణకు సహకరిస్తానన్న హామీని బేఖాతరు చేశారన్నారు. చిన్న చిన్న కారణాలు చూపుతూ ఏడాదిన్నరగా విచారణకు హాజరు కావడం లేదన్నారు. చాలా మంది సాక్షులు జగన్ ప్రభుత్వంలో అధికారులుగా ఉన్నందున.. స్వేచ్ఛాయుత విచారణ ఆశించలేమని పిటిషన్లో ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్పై ఇప్పటికే కోర్టు పలుసార్లు కోర్టు విచారణ జరిపింది.
ఇదీ చదవండి
Viveka murder case: వివేకా హత్య కేసులో నా ప్రమేయం లేదు: ఎర్ర గంగిరెడ్డి