తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘోరంగా ఓటమి చూసింది. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోకుండా కుప్పకూలిపోయింది. అయితే పరాజయంపై ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(MP Komati Reddy) తనదైన రీతిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మాణిక్కం ఠాగూర్ లాంటి పెద్ద నేతలు తెలంగాణకు వచ్చి 2023లో అధికారం మాదే అంటుంటే నిజమే అనుకున్నానని కోమటిరెడ్డి అన్నారు. ఈ మేరకు సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీలో పెద్ద పెద్ద నాయకులకు ప్రజల్లో మంచి క్రేజ్ ఉందని భ్రమ పడినట్లు చెప్పారు. లేదంటే హుజూరాబాద్ ప్రచారానికి తానే వెళ్లేవాడినని చెప్పారు.
ఏపీలోనే అధిక ఓట్లు..
కాంగ్రెస్ తరఫున వార్డ్ మెంబర్ కూడా లేని ఏపీలో తమ పార్టీ ప్రభావం చూపిందని కోమటిరెడ్డి(MP Komati Reddy) అన్నారు. బద్వేలు ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు 6వేల ఓట్లు వచ్చాయని కానీ.. హుజూరాబాద్‌లో 3వేల ఓట్లే వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయంటూ కొందరు తమకు 72 నుంచి 78 సీట్లు వస్తాయని పోర్ట్‌ఫోలియోలు పంచుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
మా పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులకు ప్రజల్లో మంచి క్రేజ్ ఉందనుకున్న. నేను పెద్ద నాయకుడిని కాదని ఇంట్లో కూర్చున్న. లేదంటే నేనైనా ప్రచారానికి వెళుతుంటి. టికెట్లు కూడా పంచేశారు ఇక నాతో ఏం అవసరముందని.. హుజురాబాద్ ప్రచారానికి వెళ్లలేదు.
-కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ, భువనగిరి
తాను తెలంగాణ ఉద్యమకారుడినని.. రాష్ట్రం కోసం మంత్రి పదవిని త్యాగం చేసినట్లు కోమటిరెడ్డి(MP Komati Reddy) గుర్తు చేశారు. తనకు ఏ పదవి లేకున్నా.. ఎంపీ అనే పెద్ద పదవి ఉందని ధీమా వ్యక్తం చేశారు.
హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఓటమిపై గతంలోనూ కీలక వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి(MP Komati Reddy). దుబ్బాక, నాగార్జునసాగర్‌లో పని చేసినట్లుగా హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పని చేయలేదని విమర్శించారు. అక్కడి వాస్తవ పరిస్థితులను కాంగ్రెస్ హైకమాండ్‌కు వివరిస్తానని ఆయన అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకు ఒక్క సభ కూడా నిర్వహించలేదని ఆరోపించారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు గట్టి క్యాడర్ ఉందని.. కార్యకర్తలను తమవైపునకు తిప్పుకోవడంలో ప్రయత్నించలేదని(MP Komati Reddy) విమర్శించారు. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఐదు నెలలైనా పార్టీ పట్టించుకోలేదని ఎంపీ మండిపడ్డారు.