జార్ఖండ్ రాజధాని రాంచీకి దగ్గరలోని తోరుఫాకు చెందిన వివాహిత బబిత మతిస్థిమితం కోల్పోయింది. ఈ క్రమంలోనే.. ఆమె ఇంటికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ నుంచి వెళ్లే రైలు ఎక్కేసింది. బబిత కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంతో వెతికారు. కానీ ఆమె ఆచూకి మాత్రం లభ్యం కాలేదు. మతిస్థిమితం లేకుండా అక్కడ తప్పిపోయిన బబిత.. ఎట్టకేలకు 2012లో తెలంగాణలోని కరీంనగర్‌కు చేరింది.
తొమ్మిదేళ్ల బబిత ప్రయాణం..
దీనస్థితిలో ఉన్న ఈ అభాగ్యురాలిని.. ప్రాకృతి ఎన్విరాన్ మెంటల్ సొసైటీ చేరదీసింది. ఆమెను మాములు స్థాయికి తీసుకురావాలనే లక్ష్యంతో సొసైటీ సభ్యులు 2014లో హైదరాబాద్‌లోని కస్తూర్బా గాంధీ జాతీయ మోమోరియల్ ట్రస్ట్‌కు తరలించారు. అక్కడ ఉంటూనే ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో వైద్యం తీసుకుంది. 2014 నుంచి 2019 వరకు పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడటంతో.. కాస్త సాధారణ స్థితిలోకి వచ్చింది. ఈ సమయంలోనే ఆశ్రమ నిర్వాహుకులు, వైద్యులు వివరాలను ఆరా తీశారు. రాంచీ సమీపంలోని తోరుఫా అని చెప్పింది. యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ యూనిట్ సహకారంతో బబిత కుటుంబ సభ్యులను గుర్తించి.. ఆమె బతికే ఉందనే సమాచారాన్ని అందించారు. తొమిదేళ్ల క్రితం తప్పిపోయిన బబిత బతికే ఉందన్న సమాచారంతో.. ఆమె కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది.
ఎట్టకేలకు కుటుంబసభ్యుల చెంతకు..
బబిత బతికే ఉన్న సమాచారం తెలిసినప్పటికీ ఆశ్రమ నిర్వాహుకులు పూర్తి స్థాయిలో నిర్థారించుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఈలోగా కరోనా వల్ల లాక్‌డౌన్ విధించడంతో రవాణా సదుపాయం లేక ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్ రాలేకపోయారు. ఎట్టకేలకు బబిత కుమార్తె, సోదరుడు, సోదరి... హైదరాబాద్ రావడంతో అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాత పోలీసుల సమక్షంలో ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మతిస్థిమితం కోల్పోయిన బబితను మామూలు మనిషిని చేసి... కుటుంబ సభ్యులకు అప్పగించడం పట్ల కస్తూర్బా గాంధీ జాతీయ మోమోరియల్ ట్రస్ట్ ప్రతినిధి పద్మావతి సంతోషం వ్యక్తం చేశారు.
భావోద్వేగానికి లోనైన కుటుంబీకులు..
తొమ్మిదేళ్ల క్రితం తప్పిపోయిన బబితను.. ప్రత్యక్షంగా చూసిన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. బబితను అలింగనం చేసుకుని కన్నీరుమున్నీరయ్యారు. బితను ఆమె కుటుంబ సభ్యులు. తీసుకువెళ్తున్న సందర్భంలో.. తోటి వాళ్లు ఆనందబాష్పాలతో వీడ్కోలు పలికారు.
"ఇన్నేళ్లకు మా అక్క దొరకడం చాలా సంతోషంగా ఉంది. బబిత అసలు పేరు కుల్మని బెంగ్రా. రంగారెడ్డి జిల్లా డీసీపీతో మేడం మాట్లాడించారు. చాలా సంతోషం వేసింది. తెలంగాణకు మేము మొదటిసారి వచ్చాం. ఇన్నేళ్లుగా బబిత (కుల్మని బెంగ్రా) ను సంరక్షించినందుకు మేడంకు కృతజ్ఞతలు చెబుతున్నాను." - బబిత సోదరుడు
ఇదీ చూడండి: