కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నవంబరు 20 నుంచి డిసెంబరు ఒకటో తేదీ వరకు నిర్వహించనున్న తుంగభద్ర పుష్కరాలకు కర్నూలు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, అనిల్‌కుమార్ ఆదేశించారు. పుష్కర ఘాట్ల పనులను నాణ్యతతో చేపట్టాలన్నారు. అమరావతిలోని కార్యాలయం నుంచి మంత్రులు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ప్రజాప్రతినిధులు, అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. పనులకు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు తక్షణ, దీర్ఘకాలిక అవసరాలుగా విభజించి శుక్రవారంలోపు పంపాలని సూచించారు. జిల్లాలో పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే 18 కమిటీలు వేసినట్లు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. ప్రాధాన్య ప్రాంతాల్లో 17 ఘాట్లను గుర్తించామని, వీటికి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేశామని వెల్లడించారు. ఇప్పటికే గుర్తించిన ఘాట్లతోపాటు భక్తుల సౌకర్యార్థం మరిన్ని ఏర్పాటు చేయాలని సమావేశంలో కర్నూలు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి