తెలుగు రాష్ట్రాలు బాగుండాలని సీఎం కేసీఆర్ కోరుకున్నారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఏపీ పాలకులు మాత్రం తెలంగాణతో కయ్యానికి సిద్ధమవుతున్నారని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాకు కృష్ణా జలాలు తరలించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏపీ పాలకులు అన్యాయం చేస్తుంటే ఊరుకోమని స్పష్టం చేశారు.
కృష్ణానది పరివాహకంలో లేని జిల్లాలకు కృష్ణా జలాలు కావాలా? అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. నది ఒడ్డున ఉన్న పాలమూరు ప్రజలకు కృష్ణా జలాలు వద్దా? అంటూ నిలదీశారు. ట్రైబ్యునల్, ఎన్జీటీ ఆదేశాలను కూడా ఏపీ ప్రభుత్వం ధిక్కరిస్తోందని ఆరోపించారు. టెలీమెట్రీలను ధ్వంసం చేసి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీరు వాడుకుంటోందన్నారు. సీమాంధ్ర ప్రజలు హైదరాబాద్‌లో ప్రశాంతంగా ఉన్నారన్న శ్రీనివాస్ గౌడ్.. ఐక్యంగా ఉండేందుకు తెలంగాణ ప్రయత్నిస్తోందని వెల్లడించారు. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలపై.. శ్రీనివాస్‌గౌడ్ స్పందించారు.
ఏపీ మంత్రి ఏమన్నారంటే..
చట్టానికి లోబడే రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ మంత్రి అనిల్‌కుమార్ వెల్లడించారు. కృష్ణా నది నుంచి చుక్కనీరు కూడా ఎక్కువ తీసుకోవడం లేదన్నారు. పోతిరెడ్డిపాడు వద్ద లిఫ్ట్ పెడితే.. తప్పెలా అవుతుందో తెలంగాణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు సామర్థ్యం పెంచుకున్నారని.. ఆర్‌డీఎస్ (RDS)కు సంబంధించి ఏపీకి 4 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని మంత్రి అనిల్ తెలిపారు. ఏపీలో ఎక్కడా ప్రాజెక్టులు అక్రమంగా కట్టడం లేదన్న మంత్రి అనిల్... తెలంగాణలో అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు చేపడుతున్నారని ఆరోపించారు.
ఇదీచూడండి: