ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి సంస్థ (ఏపీఎస్డీసీ) చేసిన అప్పులకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వలేదని, ఆ అవసరం కూడా లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. దిల్లీలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ .. ఏపీఎస్డీసీ చేసిన అప్పులను గుట్టుగా పెట్టారనడం సరికాదన్నారు. జీవో నంబర్లు చెబుతూ గుట్టు అనడమేమిటని ప్రశ్నించారు. అమ్మ ఒడి, మహిళలకు ఆసరా, చేయూత వంటి పథకాల కోసం అప్పులు తీసుకున్నామని తెలిపారు. ఈ అంశంపై శాసనసభలో చర్చించి చట్టం చేశామని, ఏ కార్యక్రమాల కోసం అప్పులు తీసుకున్నామో వాటికే వాడుతున్నామని తెలిపారు.
గ్యారెంటీ ప్రస్తావన ఎందుకొస్తుంది?
ఆబ్కారీపై వచ్చే పన్నును (ఏఆర్‌ఈటీ) అప్పు కట్టడానికి కేటాయించామన్నారు. ఏఆర్‌ఈటీని ఉపసంహరించుకుంటే లేదా రద్దు చేస్తే ఈ ఒప్పందం ప్రస్తావన వస్తుందన్నారు. అప్పు కడుతున్నంత వరకు ఒప్పందమే అమల్లో ఉండదని.. అలాంటప్పుడు గ్యారంటీ ప్రస్తావన ఎందుకొస్తుందని ప్రశ్నించారు. గ్యారంటీ అమల్లో లేదు కాబట్టే శాసనసభలో 52 బుక్ చూపించలేదన్నారు. ఇంత సాధారణ భాషలో ఉన్నది కేశవ్ అర్థం చేసుకోలేకపోతున్నారని విమర్శించారు. అప్పులకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వుబ్యాంకు అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నిస్తున్నారని.. రూ.90 వేల కోట్ల నుంచి రూ.2.60 లక్షల కోట్ల వరకు అప్పులు చేసిన మీరు తీసుకున్నారా అని పయ్యావులను ఉద్దేశించి ప్రశ్నించారు.
గందరగోళ పడుతున్నారా?
అనుమతులు అక్కర్లేదని, అప్పులు తీసుకునే హక్కు రాష్ట్రాలకు ఉందని తెలిపారు. ప్రభుత్వం మారితే అప్పులు ఎవరు కడతారని పయ్యావుల ప్రశ్నిస్తున్నారని మీరు చేసిన అప్పులు మేం కట్టడం లేదా అని ఎదురుప్రశ్నించారు. ఆహ్వాన పత్రికల్లో గవర్నర్‌కు హిజ్ ఎక్స్‌లెన్సీ వాడతారని, జీవోల్లో అలా అనరని చెప్పారు. సాధారణంగా పీఏసీ ఛైర్మన్ అలా మాట్లాడరని, అలా మాట్లాడిస్తున్నారనుకుంటున్నానని అభిప్రాయపడ్డారు. తెచ్చిన రుణం కన్సాలిడేటెడ్ ఫండ్‌లో రాలేదంటున్నారని, కానీ వచ్చిందని తెలిపారు. కేశవ్ గందరగోళ పడుతున్నారా.. గందరగోళం పెడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు.
ఇదీ చదవండి: మాన్సాస్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు