వైకాపా పని అయిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు చెబుతున్నారని, వాస్తవానికి వారి పార్టీ పనే అయిపోయిందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. 0 నుంచి 0.01కి వస్తే దాన్ని పుంజుకోవడం అని చంద్రబాబు అనుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. మాయ, మోసం, దగాతోనే ఆ పార్టీ పుంజుకుంటోందని తెలిపారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు, విశాఖ ఉక్కు కర్మాగారం అంశాలపై ఆదివారం విశాఖలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల మొదటివిడత తరహాలోనే రెండో విడతలోనూ వైకాపా మద్దతుదారులు అత్యధిక సర్పంచి స్థానాల్ని గెలుచుకున్నారని పేర్కొన్నారు.
రెండో విడతలో 3,328 పంచాయతీలకు ఎన్నికలకు జరగ్గా ఏకగ్రీవాలతో కలిపి వైకాపా 2639, తెదేపా 536, భాజపా 6, జనసేన 36, వైకాపా రెబల్స్, మిగిలినవారు కలిపి 108 మంది గెలిచారని తెలిపారు. మరో మూడుచోట్ల ఫలితాలు రావాలన్నారు. ‘ఇవీ వాస్తవాలు. చంద్రబాబులా మేం అంకెలగారడీ చేయడంలేదు. తొలి రెండు విడతలతో పోల్చితే 3, 4 విడతల్లో వైకాపా మద్దతుదారుల విజయశాతం మరింత పెరుగుతుంది’ అని పేర్కొన్నారు. మొదటి విడతలో తమ మద్దతుదారుల ఫొటోలతో ప్రచురించినట్లే ఒకటి రెండు రోజుల్లో రెండోవిడత విజేతల జాబితాను మీడియాకు విడుదల చేస్తామన్నారు.
‘ఉక్కు’పై అవసరమైతే అసెంబ్లీ తీర్మానం
విశాఖ ఉక్కు కర్మాగారంపై మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఈ ప్లాంటు కొంత నష్టాల్లో ఉన్నమాట వాస్తవమేనని, ఆ నష్టాల్ని అధిగమించేందుకు సీఎం లేఖలో సూచించినట్లు పారిశ్రామిక విధానంలో కేంద్రం మార్పులు తీసుకొచ్చి ఉద్యోగులకు ధైర్యాన్నివ్వాలని అన్నారు. ప్రైవేటీకరణ సరికాదన్నారు. ప్లాంటును దక్కించుకునేందుకు అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేసి, మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకున్నా తాము సిద్ధంగా ఉన్నామని వివరించారు. సమావేశంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.
ఇదీ చూడండి. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... 14 మంది దుర్మరణం