ప్రతిపక్ష నేత హోదాలో ఎన్నికలకు ముందు మద్య నిషేధం అంటూ పదేపదే చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి... ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా మద్యంపై వచ్చే ఆదాయమే తమకు ప్రధానమని, ఆ డబ్బులతోనే అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తున్నామని కుండబద్దలు కొట్టేశారు. మద్యం తాగే బలహీనతను ఆసరాగా చేసుకుని.. తద్వారా ఆదాయం లాక్కుని.. అవే డబ్బులతో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఇదే సంక్షేమ రాజ్యమని చెప్పడంద్వారా మద్య నిషేధం హామీని తుంగలో తొక్కారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని, మద్యం నిల్వల్ని కొన్నేళ్లపాటు హామీగా చూపించి కార్పొరేషన్ల ద్వారా ఇప్పటికే రూ.వేల కోట్ల రుణాలు తీసుకోవడం.. చేయూత, అమ్మ ఒడి, ఆసరా వంటి సంక్షేమ పథకాల అమలుకు మద్యంపై వచ్చే ఆదాయాన్ని వినియోగిస్తామంటూ ఆ పథకాల అమలు బాధ్యతను మద్యం అమ్మే ఏపీఎస్‌బీసీఎల్‌కు అప్పగించడం, అందుకు ఏకంగా చట్టాన్నే సవరిస్తూ ఆర్డినెన్సు తీసుకొచ్చి అందులో ఆ విషయాన్ని ప్రస్తావించడం మద్య నిషేధ హామీకి తూట్లు పొడవడం కాక మరేమిటి?
జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు..: తమ ప్రభుత్వం త్వరలోనే అధికారంలోకి వస్తుందని, అందులో మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని చెప్పారు. డబ్బులున్నవాళ్లు తాగితే పర్వాలేదు గానీ, ఎక్కడికక్కడ మద్యం దుకాణాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్నారు.
ఎన్నికలకు ముందు..: అధికారంలోకి వచ్చాక మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తామని ఎన్నికల ప్రణాళికలో పెట్టారు. తర్వాత మద్యాన్ని కేవలం అయిదు నక్షత్రాల హోటళ్లకే పరిమితం చేస్తామనీ అందులో చెప్పారు.
అధికారంలోకి వచ్చాక..: మాట కొద్దిగా మారింది. మద్యంపై వచ్చే ఆదాయాన్ని పూర్తిగా తీసేయలేమని.. క్రమంగా తగ్గిస్తామని అన్నారు. అయిదు నక్షత్రాల హోటళ్లకు పరిమితం చేసిన తర్వాత మాత్రమే 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని ఘంటాపథంగా చెప్పారు.
జగన్ తాజాగా..: మద్యం ద్వారా రాష్ట్రానికి డబ్బులు రాకూడదన్నదే చంద్రబాబు ఉద్దేశమని.. మద్యం డబ్బులు వస్తే అక్కచెల్లెమ్మలకు మేలు కలుగుతుందని, అది జరగకూడదనే ప్రతిపక్షం భావిస్తోందని విమర్శలు గుప్పించారు. అంటే.. తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నింటినీ మద్యం ఆదాయంతోనే అమలుచేస్తోందని చెప్పకనే చెప్పారు. మరి మద్యనిషేధం మాట ఏమైనట్లు? ఆ ఆదాయం ఆగిపోతే... పథకాలూ ఆగిపోతాయా?
చంద్రబాబు మద్యాన్ని నిషేధిస్తారో లేదో నాకు తెలీదు. ఆయన ప్రభుత్వం పోతుంది. రెండేళ్లకో, మూడేళ్లకో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మన ప్రభుత్వంలో మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాం. డబ్బులున్నవాడో, సూటుబూటు వేసుకున్నవాడో 5 నక్షత్రాల హోటళ్లకు వెళ్లి తాగితే ఫర్వాలేదుకానీ ఇంత విచ్చలవిడిగా ప్రజలతో మద్యం తాగిస్తారా? దీనివల్ల పిల్లల చదువులూ దారి తప్పుతున్నాయి. పదో తరగతి ఉత్తీర్ణులవుతూనే మద్యం దుకాణాల వైపు చూస్తున్నారు. ఎక్కడికక్కడ మద్యం దుకాణాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. 5 నక్షత్రాల హోటళ్లు మినహా ఇంకెక్కడా మద్యం లభించకుండా చేస్తాం. - ప్రతిపక్షనేత హోదాలో విజయవాడలో 2015 డిసెంబరు 8న విలేకరులతో ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యలు
అయిదు నక్షత్రాల హోటళ్లకే మద్యం పరిమితం చేస్తాం ‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే మేము అధికారంలోకి వచ్చాక మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. ఆ తర్వాత కేవలం 5 నక్షత్రాల హోటళ్లలోనే మద్యం లభ్యమయ్యేలా చేస్తాం’ - 2019 ఎన్నికల ప్రణాళికలో వైకాపా హామీ
‘మద్యంపై వచ్చే ఆదాయాన్ని ఒకేసారి పూర్తిగా తీసేయలేం. అందుకే దశలవారీ మద్య నిషేధం అమలు చేస్తాం. దానిపై వచ్చే ఆదాయాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వెళ్తాం. 2024 ఎన్నికల నాటికి కేవలం 5 నక్షత్రాల హోటళ్లకే మద్యాన్ని పరిమితం చేస్తాం. ఆ తర్వాతే ఓట్లు అడుగుతాం. మద్యంతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడంతో పాటు పునరావాస కేంద్రాల్ని పెంచుతాం’ -2019 ఎన్నికల్లో గెలిచాక దిల్లీలో నిర్వహించిన తొలి ప్రెస్‌మీట్‌లో 2019 మే 26న జగన్
‘మద్యం బ్రాండ్లను చీప్‌లిక్కర్ అంటూ నాటు సారా బ్రాండ్లుగా ముద్ర వేసేందుకు తెదేపా ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని తగ్గించడానికే దుష్ప్రచారం చేస్తోంది. మద్యం ద్వారా రాష్ట్రానికి ఎలాంటి డబ్బులూ రాకూడదనేది ఈ పెద్ద మనిషి (చంద్రబాబు) ఉద్దేశం. ఆ డబ్బులు వచ్చాయంటే అక్క చెల్లెమ్మలకు జగన్ మంచి చేస్తాడు. ఆ మంచి జరగకూడదు. రాష్ట్రానికి డబ్బులు రాకూడదు. అప్పులు పుట్టకూడదనే ఎస్‌జీఎస్ నివేదిక పేరిట మద్యంలో హానికారక పదార్థాలున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రోజూ ఒక పద్ధతి, ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్రాన్ని ఎలా కుదేలు చేయాలా అని దిక్కుమాలిన ఆలోచనలు చేస్తున్నారు’ - అసెంబ్లీలో బుధవారం రోజు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి
మద్యం ఆదాయాన్ని తగ్గించడం ఇదేనా?
- దశలవారీ మద్యనిషేధం అంటే మద్యం లభ్యతను, దానిపై వచ్చే ఆదాయాన్ని క్రమంగా తగ్గించాలి. మద్యపానాన్ని నిరుత్సాహపరిచేలా చర్యలు తీసుకోవాలి. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అందుకు పూర్తి విరుద్ధంగా వెళ్తోంది. మద్యం తాగేవారి నుంచి మరింత సొమ్ము పిండుకోవటమే లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
- వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి చూస్తే.. ఒక్క ఏడాది (2020-21లో) మినహా మద్యం విక్రయాల విలువ పెరుగుతూనే ఉంది. కొవిడ్ వల్ల కొన్నిరోజుల పాటు మద్యం దుకాణాలు మూసేయడంతో ఆ ఏడాదిలో విక్రయాల విలువ కొంత తగ్గినా.. ఆదాయం మాత్రం రూ.20 వేల కోట్లు మార్కును దాటేసింది.
- అమ్ముడయ్యే మద్యం పరిమాణం 2020-21తో పోలిస్తే 2021-22లో మళ్లీ పెరిగింది. 2020-21లో 1.94 కోట్ల ఐఎంఎల్, 57.56 లక్షల బీరు కేసులు అమ్ముడుకాగా.. 2021-22లో ఫిబ్రవరి వరకే 2.38 కోట్ల ఐఎంఎల్, 71.63 లక్షల బీరు కేసులు అమ్ముడయ్యాయి. దీన్ని బట్టి వినియోగం ఎలా పెరుగుతుందో అర్థమవుతుంది.
- మద్యం ధరలు షాక్ కొట్టేలా ఉంటే వినియోగం తగ్గుతుందంటూ తొలుత ధరలను భారీగా పెంచారు. తర్వాత వాటిని తగ్గించారు. ధరలు పెంచినప్పుడు అమ్ముడైన మద్యం పరిమాణం తగ్గినా... ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గలేదు. ఇప్పుడు ధరలు తగ్గించిన తర్వాత అమ్ముడవుతున్న మద్యం పరిమాణం పెరిగి ఆదాయం పెరిగింది. అంటే అటు ధరలు పెంచినా.. తగ్గించినా ఆదాయం పెంచుకోవటమే ప్రభుత్వ లక్ష్యమైంది.
గత రెండేళ్లుగా మద్యం దుకాణాల తగ్గింపే లేదు.. తెరపైకి వాకిన్ స్టోర్‌లు
- 2019 అక్టోబరు 2న ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. అంతకుముందు 4,380గా ఉన్న మద్యం దుకాణాల సంఖ్యను అప్పట్లో 3,500కు పరిమితం చేశారు. తర్వాత 2020 మేలో ఆ సంఖ్యను 2,934కు కుదించారు. తర్వాత నుంచి దాదాపు రెండేళ్లు పూర్తికావస్తున్నా ఇప్పటివరకూ ఒక్క మద్యం దుకాణం కూడా తగ్గించలేదు.
- 2,934కే మద్యం దుకాణాల్ని పరిమితం చేశామని గొప్పలు చెప్పే ప్రభుత్వం ఆ దుకాణాల స్థానంలో వాకిన్ స్టోర్లను తీసుకొచ్చింది. సాధారణ దుకాణాల్లో రోజుకు సగటున రూ.2.50 లక్షల విలువైన మద్యం అమ్మితే ఈ దుకాణాల్లో రోజుకు సగటున రూ.10 లక్షల వరకూ అమ్ముతారు.
అంత ఆదాయం రావాలంటే: రాబోయే ఆర్థిక సంవత్సరంలో (2022-23)లో మద్యంపై విధించే స్టేట్ ఎక్సైజ్‌పన్ను ద్వారా రూ.16,500 కోట్ల ఆదాయం వస్తుందని తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొంది. కనీసం రూ.30వేల కోట్ల మద్యాన్ని ప్రజలతో తాగిస్తేనే స్టేట్ ఎక్సైజ్‌పన్ను రూపేణా ప్రభుత్వం అంచనా వేసిన ఆదాయం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.రికార్డుస్థాయిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాలు జరిపిన ప్రభుత్వం.. రూ.30వేల కోట్ల మద్యం అమ్మాలంటే ఇంకా ఎంతమందితో తాగించాలి? ఎంతమందిని తూగించాలి? 2016-17లో మద్యంపై ప్రభుత్వానికి స్టేట్ ఎక్సైజ్ పన్ను ద్వారా రూ.4,644.66 కోట్లు రాగా.. బడ్జెట్ అంచనాల ప్రకారం రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.16,500 కోట్లు వస్తుందని అంచనా. అంటే ఆరేళ్లలో మద్యం విక్రయాల ద్వారా స్టేట్ ఎక్సైజ్ పన్ను రూపేణా వచ్చిన ఆదాయం 355 శాతం పెరిగింది.
మద్యంపై ఆదాయాన్ని హామీగా చూపించి... అప్పులు: రాబోయే కొన్నేళ్లలో మద్యంపై వచ్చే ఆదాయాన్ని హామీగా చూపించి రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా ఇప్పటికే బ్యాంకుల నుంచి రూ.వేలకోట్ల అప్పులు చేసింది. అంటే.. అన్నేళ్లపాటు మద్యం వ్యాపారం కొనసాగిస్తామని ప్రభుత్వం చెబుతున్నట్టే కదా! అంతే కాదు.. ఆ అప్పు తీరాలంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ తన వ్యాపారాన్ని భారీగా విస్తరించాలి. అంటే మద్యం అమ్మకాల్ని పెంచుకోవాలి. ఈ విషయాన్ని ప్రభుత్వ చర్యలే స్పష్టం చేస్తున్నాయి. అలాంటప్పుడు దశలవారీ మద్యనిషేధం ఎలా సాధ్యం?
మద్యం డిపోలు, వాటిలోని నిల్వలు, వ్యాపారం, ఇతర చరాస్తులు, సరఫరాదారులతో కుదిరిన ఒప్పందాలు వీటన్నింటినీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్)కు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బదలాయించింది. రాబోయే కొన్నేళ్లపాటు మద్యంపై వచ్చే ఆదాయాన్ని హామీగా చూపించి ఆ కార్పొరేషన్ ద్వారా రూ.40వేల కోట్ల రుణాలు తీసుకునేందుకే ఇలా చేసిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అదనపు రిటైల్ ఎక్సైజ్ డ్యూటీని విధించి పది మద్యం డిపోల ద్వారా లభించే ఆదాయం ఖజానాకు వచ్చాక తిరిగి బ్యాంకులకు బదలాయించేలా ఎస్క్రో చేసి ఎస్‌బీఐ కన్సార్షియం నుంచి రూ.23వేల కోట్ల రుణం తీసుకున్నారు.
ఈ ప్రశ్నలకు బదులేది...?: మద్యం మంచిది కాదని ఎవరు, ఎలా చెప్పినా అది మద్యపానాన్ని నిరుత్సాహపరిచేదే కదా? అది నిషేధానికి దోహదపడేదే కదా! అలాంటప్పుడు దానిపై జరుగుతున్న ప్రచారం వల్ల నష్టమేమీ లేదు కదా! మరి ఎందుకు ఎదురుదాడి చేస్తున్నట్టు?
- మద్యం తాగటం హానికరమేనని.. అయితే సారాతో పోలిస్తే కొంత తక్కువ హానికరమంటూ సీఎం జగన్ బుధవారం అసెంబ్లీలో పేర్కొన్నారు. ఓ వైపు మద్యం తాగటం హానికరమేనని చెబుతూ... దాని ద్వారా ఆదాయం తెచ్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటే దాని అర్థమేంటి? అన్ని వేలకోట్ల విలువైన మద్యం తాగటం ద్వారా అన్ని లక్షలమంది ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నట్లు కాదా?
మద్యం ఆదాయంతో పథకాలు అమలు చేస్తానని అప్పుడే ఎందుకు చెప్పలేదు?
మద్యనిషేధం విధిస్తానంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఇప్పుడు మద్యం అమ్మకాల ద్వారా ఆదాయాన్ని ఎలా ఆశిస్తారు? ఆయన ఇచ్చిన హామీలన్నీ వట్టిమాటలేనా? మద్యం ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తానంటారా? మరి ఆ విషయం ఎన్నికలకు ముందే ఎందుకు చెప్పలేదు? రెండేళ్లుగా మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించనే లేదు. ఇదేం తీరు?- రమాదేవి, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు
ఇదీ చదవండి: విశాఖ ఉక్కుపై కేంద్రమంత్రి వ్యాఖ్యలు సరికాదు: కార్మిక నేతలు