లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో వ్యవసాయ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకమూ కలగకుండా అవసరమైన కార్యాచరణ చేపట్టాల్సిందిగా.. ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ పనులు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, మార్కెటింగ్, ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల సరఫరా దుకాణాలు తెరుచుకునేందుకు అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో ఈ వెసులుబాటు కల్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
జాగ్రత్తలు తీసుకోవాలి
ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం నాట్లు, వ్యవసాయ కూలీల రవాణా, విత్తన విక్రయాలు, ఎరువులు, పురుగుమందుల సరఫరా తదితర అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి. కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా మిగతా ప్రాంతాల్లో ఈ కార్యకలాపాలకు అంతరాయం లేకుండా చూడాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
వ్యవసాయ యంత్ర పరికరాల సరఫరా, విక్రయాలు, మరమ్మతులు జరిగే దుకాణాలు, వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ తెరిచి ఉండేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ దుకాణాల వద్ద పెద్ద ఎత్తున గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
వారికి పాసులు జారీ చేయండి
వ్యవసాయ కూలీల రాకపోకలపై దృష్టి పెట్టాలని.. స్థానిక వ్యవసాయ అధికారుల సాయంతో వారికి పాసులు జారీ చేసే అంశాలను పరిశీలించాలని ప్రభుత్వం పేర్కొంది. వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల విక్రయ, సేకరణ కేంద్రాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల డీలర్లు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాల విక్రయాల దుకాణాలు, మరమ్మతులు జరిగే ప్రాంతాలు, స్ప్రేయర్లు ఇతర కార్యకలాపాలు, నర్సరీలు, కలుపు తీత యంత్రాలు, స్ప్రింక్లర్లు, డ్రిప్ పనిముట్లు, రుణాల కోసం రైతులు సంప్రదించే బ్యాంకు ప్రాంగణాలు, ఇతర సంస్థలు తెరిచిఉంచేలా సహకరించాలని ప్రభుత్వం తెలిపింది.
ట్రాక్టర్లు, స్ప్రేయర్ల కోసం పెట్రోలు ఖరీదు చేసే బంకులు, విత్తన శుద్ధి, రవాణా, నిల్వ కేంద్రాలు పనిచేసేలా చూడాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ కేంద్రాల వద్ద పనిచేసే సిబ్బందికి ప్రత్యేక పాసులు జారీ చేయాల్సిందిగా సూచనలు ఇచ్చారు.
ఇదీ చదవండి: