HC ON KOLANUKONDA TEMPLE LAND: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామంలోని శ్రీ భోగేశ్వస్వామి దేవాలయానికి చెందిన సర్వేనంబరు 51-1బీలో ఉన్న మొత్తం 6.53 ఎకరాల్లోని 2.53 ఎకరాల విషయంలో యథాతథ స్థితి పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి, ఆశాఖ అధికారులు, శ్రీ భోగేశ్వరస్వామి దేవాలయం కార్యనిర్వహణ అధికారి, ఇస్కాన్లకు నోటీసులు జారీచేసింది. కౌంటర్లు వేయాలని పేర్కొంటూ విచారణను మార్చి 8 కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. భోగేశ్వర స్వామి ఆలయ భూములను నిబంధనలకు విరుద్ధంగా ఇస్కాన్ కు లీజుకు ఇచ్చారని పేర్కొంటూ మొత్తం 6.53 ఎకరాల్లో 2.53 ఎకరాలను కౌలుకు తీసుకున్న మంగళగిరికి చెందిన బి. ఉమామహేశ్వరరావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. సంబంధిత జీవోను రద్దు చేయాలని కోరారు. మొత్తం 6.53 ఎకరాల్లో ఎలాంటి చర్యలు చేపట్టకుండా అధికారులను నిలువరించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు పిటిషనర్ కౌలుకు తీసుకున్న 2.53 ఎకరాల్లో స్టేటస్ కో పాటించాలని ఆదేశాలు జారీచేసింది.
అంతకు ముందు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ దేవాదాయ చట్ట నిబంధనలకు విరుద్ధంగా భూమిని 33 ఏళ్ల పాటు ఇస్కాన్ కు లీజుకిచ్చారన్నారు. వ్యవసాయ భూమిలో వ్యవసాయేతర కార్యక్రమాలు చేపట్టడానికి వీల్లేదన్నారు. ప్రభుత్వం తరపున న్యాయవాది వివేకానంద వాదనలు వినిపిస్తూ .. దేవాదాయ భూముల విషయంలో భూ వినియోగ మార్పిడి చట్టం వర్తించదన్నారు. ప్రస్తుతం ఇస్కాన్ కు కేటాయించిన భూమిలో వ్యవసాయ కార్యకలాపాలు జరగడం లేదన్నారు. భోగేశ్వర స్వామి ఆలయానికి చెందిన 6.53 ఎకరాల భూమిని ఇస్కాన్ సంస్థకు లీజుకు ఇస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులిచ్చింది. హరేకృష్ణ మూమెంట్ కమిటీ నేతృత్వంలో జరగనున్న హరేకృష్ణ గోకులక్షేత్రం నిర్మాణానికి శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి భూమి పూజ చేయనున్నారు.
ఇదీ చదవండి: