Kodikonda - Medarametla Express Way : రాయలసీమ నుంచి అమరావతికి చేరుకునేలా నిర్మించతలపెట్టిన అనంతపురం-అమరావతి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (384 కి.మీ.)ను రాష్ట్ర ప్రభుత్వం పక్కనబెట్టింది. కొత్తగా కొడికొండ నుంచి మేదరమెట్లకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (332 కి.మీ.) మంజూరయ్యేలా చూసింది. దీనికి కేంద్రం తాజాగా పచ్చజెండా ఊపింది. దీంతో 384 కి.మీ.స్థానంలో.. కొత్తగా 332 కి.మీ. రహదారితోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. కొడికొండ-మేదరమెట్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి కొత్త ప్రాజెక్ట్ అని అధికారులు చెబుతుండగా.. ఓ రకంగా అనంత-అమరావతి ప్రాజెక్ట్‌ను నిర్వీర్యం చేసి కొత్తది తెచ్చుకున్నట్లు అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు అనంతపురం జిల్లా కొడికొండ నుంచి కడప జిల్లా మీదుగా ప్రకాశం జిల్లాలోని మేదరమెట్ల సమీపంలో జాతీయరహదారి-16లో కలిసే ఈ రహదారి ప్రతిపాదనకు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ (ఆర్‌టీహెచ్) ఆమోదం తెలిపింది.
సీఎం జగన్ సొంత నియోజకవర్గం మీదుగా...
కొత్త ప్రాజెక్ట్ కోసం నాలుగు అలైన్‌మెంట్లను రూపొందించారు. ఇందులో... కొడికొండ వద్ద మొదలై సీఎం సొంత నియోజకవర్గ కేంద్రమైన పులివెందుల మీదుగా వీరపునాయినిపల్లి మండలం అనిమెల, మైదుకూరు, పోరుమామిళ్ల వద్ద మల్లేపల్లి, ప్రకాశం జిల్లా వంగపాడు, కనిగిరి మీదుగా మేదరమెట్లకు సమీపంలో ఎన్‌హెచ్-16లో కలిసేలా ఉన్న అలైన్‌మెంట్‌కు ఆమోదం తెలిపారు. మధ్యలో మల్లేపల్లి నుంచి గిద్దలూరు, నూజెండ్ల మీదుగా చిలకలూరిపేటకు ప్రతిపాదించిన మరో అలైన్‌మెంట్‌ను ఎంపిక చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఇది అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వేలోని కొంతభాగంలో వెళ్తుందని, దీనికి భూసేకరణ కూడా కొలిక్కి వచ్చిందని కేంద్ర అధికారులు పేర్కొన్నారు.
Kodikonda - Medarametla Express Way : రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పులివెందులకు సమీపం నుంచి వెళ్లే కొడికొండ-మేదరమెట్ల మార్గానికే మొగ్గు చూపింది. ఈ ప్రాజెక్ట్‌లో 332 కి.మీ.మేర నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం, భూసేకరణకు కలిపి రూ.16వేల కోట్ల వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారు. రోడ్ సర్వే, డీపీఆర్ తయారీకి ఎన్‌హెచ్‌ఏఐకి ఆదేశాలు జారీఅయ్యాయి.
- వాస్తవానికి ఇది కొడికొండ-మేదరమెట్ల ఎక్స్‌ప్రెస్‌వే అయినప్పటికీ.. అధికారులు మాత్రం బెంగళూరు-విజయవాడ మధ్య 518 కి.మీ. రహదారిగా పేర్కొనడం గమనార్హం. అటు బెంగళూరు నుంచి కొడికొండ వరకు ఎన్‌హెచ్-44 ఉన్న 73 కి.మీ.లు, ఇటు కొడికొండ నుంచి విజయవాడ వరకు జాతీయరహదారి-16లో ఉన్న 113 కి.మీ. కలిపి మొత్తం 518 కి.మీ. ప్రాజెక్ట్‌గా పేర్కొనడంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
అనంత-అమరావతి పరిస్థితి ఏమిటి?
Kodikonda - Medarametla Express Way : కొడికొండ-మేదరమెట్ల రహదారి ఆమోదం లభించడంతో.. దాదాపు నాలుగేళ్ల కిందట మంజూరైన అనంత-అమరావతి మధ్య మలుపులు లేని గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (ఎన్‌హెచ్-544ఎఫ్) ప్రాజెక్ట్ ప్రశ్నార్థకం కానుంది. దీని కోసం ఇప్పటికే అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని 2,236 హెక్టార్ల పట్టా భూములను గుర్తించి 3డి నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. వీటికి పరిహారం చెల్లించి భూములు తీసుకుంటే సరిపోతుంది. ఈ దశలోనే చాలాకాలంగా ఎటువంటి పురోగతి లేకుండా ఆగిపోయింది. 19 ప్యాకేజీల డీపీఆర్‌ల తయారీలో గతంలో 12 వరకు పూర్తి చేశారు. ఆ తర్వాత ఆగిపోయాయి.
ఇవీచదవండి.