జస్టిస్ ఎన్‌వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావడం చాలా ఆనందంగా ఉందని ఆయనతో నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య చదివిన స్నేహితులు గతాన్ని గుర్తుచేసుకున్నారు. ఏ స్థాయిలో ఉన్నా ఇప్పటికీ స్నేహితులను పిలిచి మాట్లాడతారన్నారు. అందరితోనూ కలిసిపోయే మనస్తత్వం, ఎప్పుడూ ఒకేలా ఉండటం ఆయనలోని గొప్పదనమన్నారు.
అందరితోనూ కలిసిపోయే వ్యక్తి
‘న్యాయవిద్య చదివే సమయంలోనూ పేదలకు న్యాయం అందించాలనే జస్టిస్ ఎన్‌వీ రమణ ఆలోచించేవారు. అందరితోనూ కలిసిపోతూ ఆడంబరాలు లేకుండా సాధారణ వ్యక్తిలా ఉండేవారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో చెట్లకింద కూర్చొని చదువుకున్నాం. విద్యార్థుల సమస్యలపై అందరం కలిసి పనిచేసేవాళ్లం’- కర్నల్ ఎస్.వెంకటేశ్వరరావు, ఐసీఎఫ్‌ఏఐ, న్యాయ అధికారి
ఏమాత్రం గర్వం కనిపించదు
‘జస్టిస్ ఎన్‌వీ రమణ ఎంత స్థాయికి వెళ్లినా విజయవాడకు వస్తే నన్ను పిలిచి మాట్లాడేవారు. ఏ స్థాయిలో ఉన్నా ఆయన ఒకేలా ఉంటారు. గర్వం కనిపించదు. విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య చదివే సమయంలో అందరితో కలిసి ఉండేవారు. ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావడం సంతోషం. ఒక స్నేహితుడిగా ఇంతకంటే ఆనందం ఏం ఉంటుంది’- కొమ్మినేని భావనారాయణ, న్యాయవాది, విజయవాడ
ఇదీ చదవండి: దేశ 'సర్వోన్నత' పీఠంపై తెలుగుతేజం