ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం జరిగే జనతా కర్ఫ్యూ పాటించాలని కలెక్టర్లు, అధికారులు, భాజపా కార్యకర్తలు, నేతలు పిలుపునిచ్చారు. కర్ఫ్యూ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు.
శ్రీకాకుళం జిల్లా
జిల్లా అంతటా జనతా కర్ఫ్యూ పాటించాలని కలెక్టర్ నివాస్ పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తి నిరోధంలో జిల్లా ఆదర్శంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణ పాటించాలని విజ్ఞప్తి చేశారు.
విశాఖ జిల్లా
ఆదివారం జనతా కర్ఫ్యూ ఉన్నందున చోడవరం వాసులు ఇంటికి సరిపడా నిత్యావసర వస్తువుల కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టారు. పాడేరులో భాజపా కార్యకర్తలు కర్ఫ్యూపై అవగాహన కల్పించారు. ప్రజలు సహకరించాలని కోరారు. దుకాణాల వద్దకు వెళ్లి కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కరపత్రాలు పంచారు.
తూర్పుగోదావరి జిల్లా
కరోనా ప్రభావంతో అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం నిలిపివేశారు. ఆలయ ప్రాంగణం, ఘాట్‌రోడ్డు, మెట్ల మార్గం నిర్మానుష్యంగా మారాయి.
గుంటూరు జిల్లా
గుంటూరులో తెలుగు యువత వినూత్న అవగాహన కార్యక్రమం చేశారు. రహదారిపై వచ్చిపోయే వారికి చేతులు కడిగిస్తూ అవగాహన కల్పించారు. స్వీయ పరిరక్షణ కలిగి ఉందాం... కరోనా దరిచేరకుండా జాగ్రత్త పడదాం అని నినాదాలు చేశారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ పాటించాలని కోరారు.
ప్రకాశం జిల్లా
చిన్నగంజాం పంచాయతీ అధికారులు, సోపిరాల, మున్నంవారిపాలెం తదితర గ్రామాల్లో దండోరా వేయించారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 వరకు జనతా కర్ఫ్యూ అమల్లో ఉన్నందున ఎవరూ బయట తిరగొద్దని ప్రజలకు వివరించారు.
నెల్లూరు జిల్లా
ఈ నెల 21 నుంచి ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్సు, మిగతా లావాదేవీలు నిలిపివేస్తున్నట్లు ఆత్మకూరు ఆర్టీవో ఆజాద్ హుస్సేన్ తెలిపారు. కరోనా తీవ్రత తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఆదివారం జరిగే జనతా కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని కోరారు.
చిత్తూరు జిల్లా
మదనపల్లె సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి పలు ప్రాంతాల్లో పర్యటించారు. కరోనాపై ఎలా పోరాడాలో మాక్‌డ్రిల్ రూపంలో ప్రయోగాత్మకంగా కార్యక్రమాలు చేసి ప్రజలను చైతన్యపరిచారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తికి మూడు మీటర్ల దూరం, మాస్క్ వినియోగం, ఆసుపత్రిలో ఫీవర్ సెల్ నిర్వహణ, కరోనా నివారణ కార్యక్రమాలకు అవసరమైన సామగ్రిపై వైద్యులతో సమీక్ష చేశారు.
ఇదీ చదవండి :