రాష్ట్రంలో హిందూ ఆలయాల రక్షణకు సంబంధించి ప్రభుత్వం స్పష్టంగా తన వైఖరి వెల్లడించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఆలయాల ఆస్తులు, విగ్రహాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం తీసుకొనే చర్యల గురించి ఇప్పటికీ స్పష్టత లేదని ఆరోపించారు. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన సమయంలోనే అన్ని ఆలయాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా అమలు చేయలేదన్నారు. ఇటీవల రామతీర్థంలో శ్రీ కోదండరామ స్వామి విగ్రహం ధ్వంసం తర్వాత అదే మాట చెప్పటాన్ని పవన్ తప్పుబట్టారు.
బాధ్యత నుంచి తప్పుకోవటమే...
దేవాదాయ శాఖ పరిధిలో 26వేల ఆలయాలు ఉంటే... అందులో ఎన్నింటికి సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఆలయాలే కెమెరాలు ఏర్పాటు చేసుకొని పర్యవేక్షించాలని ప్రభుత్వం చెప్పటం సరికాదన్నారు. కాంట్రాక్టుల్లో వచ్చే కమీషన్ల మీద పెట్టే శ్రద్ధ... ఆలయాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు మీదా పెట్టాలని సూచించారు. ఆధునిక సాంకేతికత ఉన్న కెమెరాలు అమర్చి ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే కేవలం ప్రకటనలకు, ప్రచారం కోసం మాత్రమే సీసీ కెమెరాల గురించి ప్రభుత్వం మాట్లాడుతోందని భావించాల్సి వస్తుందన్నారు. ధూపదీప నైవేద్యాలకు కూడా నిధులివ్వని ప్రభుత్వం... ఇప్పుడు సీసీ కెమెరాల బాధ్యత ఆలయాలదేనని చెప్పటం బాధ్యత నుంచి పక్కకు తప్పుకోవటమేనని వ్యాఖ్యానించారు.
18నెలలుగా ఏం చేశారు..?
గత ప్రభుత్వ కాలంలో కూల్చిన ఆలయాల్ని కడుతున్నామని చెబుతున్న ప్రభుత్వం.. గత 18 నెలలుగా ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఆలయాల పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు ప్రభుత్వ విధి నిర్వహణలో భాగమేనని.. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చేస్తున్న పనులేం కావని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి