నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న పచ్చతోరణం – వన మహోత్సవం పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. మంగళగిరిలోని ఎయిమ్స్ ఆవరణలో మొక్కనాటి సీఎం వైఎస్ జగన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా వన మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గత రెండు సంవత్సరాలలో 33.23 కోట్ల మొక్కలు నాటామని.. ఈ సారి కూడా అదే ఉత్సాహంతో విరివిగా మొక్కలు నాటుదామని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటే బృహత్తర లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఉపాధిహామీ పథకం కింద రాష్ట్రంలో దాదాపు 75 లక్షల మొక్కలు నాటుతున్నామన్నారు. అడవుల సంరక్షణ, పచ్చదనం పెంపొందించడమే ప్రభుత్వానికి ముఖ్య ప్రాధాన్యత అని పేర్కొన్నారు. నాడు – నేడు పథకంలో భాగంగా స్కూళ్లు, ఆసుపత్రుల ఆవరణలో మొక్కలు నాటుతున్నామని చెప్పారు. జాతీయ అటవీ విధానానికి అనుగుణంగా 33 శాతం పచ్చదనాన్ని పెంపొందించడం, తద్వారా పర్యావరణ సమతుల్యాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
Polavaram: జంతర్ మంతర్లో పోలవరం నిర్వాసితుల ఆందోళన.. జాతీయ నేతల మద్దతు