జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడుల ఛార్జ్ షీట్లో విజయసాయిరెడ్డిపై అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు వర్తిస్తాయని సీబీఐ వాదించింది. సీబీఐ, ఈడీ కోర్టులో సోమవారం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్‌లో విజయసాయిరెడ్డిపై అభియోగాల నమోదుపై విచారణ జరిగింది. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సమయంలో విజయసాయిరెడ్డి పబ్లిక్ సర్వెంట్ కానందున.. అవినీతి నిరోధక చట్టం వర్తించదని ఆయన తరఫు న్యాయవాది గతంలో వాదించారు. చార్టెడ్ అకౌంటెంట్‌గా మాత్రమే విధులు నిర్వహించారని పేర్కొన్నారు.
అయితే విజయసాయిరెడ్డిపై అవినీతి నిరోధక చట్టంలోని 9, 13 సెక్షన్ల కింద అభియోగాలు వర్తిస్తాయని సీబీఐ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ తివారీ వాదించారు. ప్రత్యేక పీపీగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించినందున.. పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు పది రోజులు గడువు ఇవ్వాలని కోరారు. జగతి పబ్లికేషన్స్, వాన్ పిక్, రాంకీ, పెన్నా, భారతీ సిమెంట్స్ చార్జ్ షీట్లపై విచారణను జనవరి 4కు సీబీఐ, ఈడీ కోర్టు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: బాలికకు తాళి కట్టేందుకు యువకుడి యత్నం.. చివరికి?