Women's day Celebrations in Telangana: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మహిళామణులు సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత అంగన్వాడీ ఉద్యోగినులతో కలిసి మహిళాదినోత్సవం జరుపుకొన్నారు. కేక్ కట్ చేసి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి మహిళా ఆత్మస్థైర్యంతో సమస్యలను ఎదుర్కొంటూ ముందుకుపోవాలని సూచించారు. మహిళల రక్షణ, అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
అన్ని రంగాల్లో పెద్దపీట
సికింద్రాబాద్ మారేడుపల్లి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్‌లో పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చీరలు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తోందని... సమాన ప్రాధాన్యం కల్పిస్తూ ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అంగన్ వాడీ ఉద్యోగులు, యూనియన్ నాయకులు మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి ఛాంబర్‌లో కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు.
మహిళామణులకు సన్మానం
నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన ఉమెన్స్ డే వేడుకల్లో సినీ నటుడు అడవి శేషు పాల్గొన్నారు. మల్లవరపు బాల లత ఆధ్వర్యంలో 3కే వాకథాన్ నిర్వహించారు. ఈ వేడుకల్లో అడవి శేషుతో పాటు నటి దివ్యవాణి, 2019 మిస్ ఇండియా తేజస్విని పాల్గొన్నారు. ఈ సందర్భంగా విభిన్న రంగాల్లో రాణిస్తున్న మహిళలను సన్మానించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సివిల్ సర్వీసెస్ ఆశావహులు పాల్గొన్నారు.
నిజామాబాద్‌లో 2కే రన్
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ ఆర్టీసీ ఆధ్వర్యంలో ఈక్వాలిటీ 2కే రన్ నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్ సీపీ ఉషా విశ్వనాథ్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుధ పరిమిళ, ప్రభుత్వ వివిధ శాఖల మహిళా అధికారులు పాల్గొన్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, ఎన్టీఆర్ చౌరస్తా, కలెక్టర్ చౌరస్తా, తిలక్ గార్డెన్, గాంధీ చౌక్, దేవీ రోడ్ మీదుగా బస్టాండ్ వరకు 2కే రన్ సాగింది.
Womens Day Special: ఆమె సకల చరాచర సృష్టికీ మూలం
స్త్రీ పాత్ర త్యాగపూరితం
సమాజంలో పురుషులతో పాటు అన్ని రంగాల్లో మహిళలకు సమాన పాత్ర ఉంటుందని అడిషనల్ సీపీ ఉషావిశ్వనాథ్ పేర్కొన్నారు. కుటుంబ అభివృద్ధిలో స్త్రీ పాత్ర త్యాగపూరితమైందని వెల్లడించారు. మహిళా అభ్యుదయానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని చెప్పారు. మానవ జాతికి మహిళ ఒక వరం అని స్పష్టం చేశారు.
Women's Day Special Story: అన్ని రంగాల్లో మగువలే.. సారథులు!!
క్యాన్సర్‌పై అవగాహన
వరంగల్ జిల్లా వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహిళా బంధు కేసీఆర్ పేరిట 3 రోజుల పాటు సంబరాలు చేసుకున్న మహిళామణులు.. నేడు చైతన్య ర్యాలీని చేపట్టారు. మహిళల్లో క్యాన్సర్ పట్ల అవగాహన పెంచేందుకు.. ఒమేగా ఆస్పత్రి, నగరపాలక సంస్థ సంయుక్తంగా ర్యాలీని చేపట్టారు. కాకతీయ మెడికల్ కళాశాల ప్రాంగణం నుంచి బల్దియా కార్యాలయం వరకు ర్యాలీని మేయర్ గుండు సుధారాణి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో నగర పాలక సంస్థలోని వివిధ విభాగాలకు చెందిన మహిళా ఉద్యోగులతో పాటు శానిటేషన్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా వేడుకలు
సిరిసిల్లలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జానపదాలకు, డీజే చప్పుళ్లకు ఆడిపాడారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే రన్‌ను ఎమ్మెల్యే సతీష్ కుమార్, సీపీ శ్వేత రెడ్డి ప్రారంభించారు.
ఇదీ చదవండి: అండర్-19 క్రికెటర్ షేక్ రషీద్‌కు పవన్ ఆర్థిక సాయం