ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వర్షాలు, భారీ వరదల వల్ల సంభవించిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించింది. ముందుగా విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో .. వరద ప్రభావిత ప్రాంతాల చిత్రాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను పరిశీలించారు. తర్వాత కలెక్టర్ ఇంతియాజ్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా శాఖల వారీగా జరిగిన నష్టాన్ని వివరించారు. మొత్తం 664 కోట్ల రూపాయల నష్టం వాటిల్లగా...ఉద్యాన పంటలు 290, వాణిజ్య పంటలు 138, రహదారులు 197, నీటి పారుదల శాఖ 143 కోట్ల మేర నష్టపోయాయని తెలిపారు.
పంట నష్టంపై ఆరా...
కృష్ణా జిల్లాలోని ఇబ్రహీపట్నం, కంచికచర్ల, చందర్లపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో నీట మునిగిన పంటలను కేంద్ర బృందం పరిశీలించింది. ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడిలో దెబ్బతిన్న పత్తి, మినుము, బెండ, వంగ పంటలను పరిశీలించారు. వరుసగా 3 సార్లు వరద ముంచెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కంచికచర్లకు వెళ్లే మార్గంలో నేల కొరిగిన వరి పంటను కేంద్ర బృందం పరిశీలించింది. గనిఆత్కూరు, చెవిటికల్లు గ్రామాల్లో వరి, పత్తి, మిర్చి పంటలను పరిశీలించారు. చందర్లపాడు మండలం కొడవటికల్లులో పూర్తిగా ఎండిపోయినందున పీకేసి కుప్పగా పోసిన మిర్చి పంటను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రైతుల నిరాశ..
అనంతపురం జిల్లాలో పంట నష్టం పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం 2 గ్రామాల్లో పర్యటించింది. స్థానిక కమతాలను పరిశీలించి, కొంతమంది రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకొంది. అయితే... గుంతకల్లు మండలంలో పర్యటించాల్సి ఉన్నప్పటికీ కేంద్రంబృందం రానందున ఆయా గ్రామాల రైతులు నిరాశకు గురయ్యారు. భారీ వర్షాల కారణంగా వ్యవసాయ అనుబంధ రంగాలు, ప్రజల ఆస్తులకు జరిగిన నష్టాన్ని సమగ్రంగా నివేదించినట్లు కలెక్టర్ చెప్పారు.
ఇదీ చదవండి
ఉదారంగా సాయం అందేలా చూడండి..కేంద్ర బృందానికి సీఎస్ విజ్ఞప్తి