వృత్తివిద్యా కళాశాలలకు అనుమతులు ఇవ్వడంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని.. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి , ఇంటర్ బోర్డు కార్యదరి, ఢిల్లీలోని సీబీఐ డైరెక్టర్, ఇంటర్ బోర్డుకు చెందిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ తనిఖీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిన్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం గురువారం ఈమేరకు ఆదేశాలిచ్చింది.
కనీస సౌకర్యాలు లేకుండా వాణిజ్య భవనాల్లో వృత్తివిద్యా కోర్సుల (పాల ఉత్పత్తులు , ఎంఎల్టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ) నిర్వహణకు కళాశాలలకు అధికారులు అనుమతులు ఇచ్చారని.. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ గంజిగుంట్ల నరసింహారెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. న్యాయవాది పి.సరస్వతి వాదనలు వినిపిస్తూ .. వృత్తివిద్యా కళాశాలలకు అనుమతులు ఇచ్చే విషయంలో భారీగా చేతులు మారాయన్నారు. క్షేత్రస్థాయిలో కనీన తనిఖీలు చేయకుండా 124 వృత్తివిద్య కళాశాలలకు అనుమతులు ఇచ్చారన్నారు.
ఇదీ చదవండి : Contempt of Court: కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష.. కానీ