ఈఎస్ఐ మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అరెస్టయిన అచ్చన్నాయుడుకు... ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. కోర్టు అనుమతితో అనిశా అధికారులు ఆయనను విచారిస్తున్నారు. గురువారం నాడు దాదాపు నాలుగు గంటల పాటు విచారణ సాగింది. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో జీజీహెచ్‌కు వచ్చిన అనిశా అధికారులు...విచారణ ప్రారంభించారు. అనిశా డీఎస్పీలు ప్రసాద్, చిరంజీవి ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. ముందుగా నిర్ణయించిన ప్రశ్నావళి మేరకు ఈ విచారణ సాగుతోంది.
అచ్చెన్నాయుడు తమ విచారణకు సహకరిస్తున్నట్లు అనిశా అధికారులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెడ్ పై పడుకునే తమ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నట్లు చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు వైద్యుడు, అచ్చెన్నాయుడు న్యాయవాది సమక్షంలో విచారణ చేస్తున్నట్లు వివరించారు.
ఇవాళ ఉదయం జీజీహెచ్‌లో అచ్చెన్నాయుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎండోస్కోపి నిర్వహించిన అనంతరం...ఆయన్ను ప్రత్యేక వార్డుకు తరలించారు. ఆ తర్వాత అనిశా అధికారుల విచారణ మొదలుపెట్టారు.
ఇవీ చదవండి: అచ్చెన్నపై అనిశా ప్రశ్నల వర్షం... ఇవాళ, రేపు కొనసాగనున్న విచారణ