రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా.. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ ఘనంగా జరిగింది. కొన్ని ప్రాంతాలు మినహా ఏపీ అంతటా.. వివిధ మతాలకు చెందిన మూడు పండుగలతో పాటు ప్రజలు నాలుగవ పండగగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. భారీ సంఖ్యలో లబ్ధిదారులు హాజరై.. నివేశన స్థలాలను అందుకున్నారు.
విశాఖ జిల్లాలో...
పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల్లో పక్కా గృహాన్ని ఏర్పాటు చేసుకోవాలని.. విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ లబ్ధిదారులకు పిలుపునిచ్చారు. గొలుగొండలో సుమారు 162 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. సంక్షేమ పథకాలను పేదలకు అందించడంలో సీఎం జగన్ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య హాజరయ్యారు.
అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చేలా సీఎం జగన్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని.. అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. అనకాపల్లి మండలంలోని మారేడు పూడి, గోపాలపురం, సీహెచ్ఎం అగ్రహారంలో పలువురు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. ఆర్డీవో సీతారామారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మాడుగుల మండలంలో 1,363 మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు అన్నారు. గత ప్రభుత్వం సొంత పార్టీ కార్యకర్తలకు పథకాలను అందజేయగా.. వైకాపా సర్కారు రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.
ఇళ్ల పట్టాల పంపిణీ తర్వాత ఏర్పాటయ్యే గృహ సముదాయాలను పచ్చని వాకిళ్లుగా తయారు చేయాలన్నది తమ లక్ష్యమని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు. రావికమతం మండలం చిన్న పాచిలి, రోలుగుంట మండలం వడ్డిపలో ఆయన మొక్కలు నాటారు. ఈ కాలనీలను చక్కని ఉద్యానవనాలుగా తీర్చిదిద్దాలని కోరారు.
శ్రీకాకుళం జిల్లాలో...
సరుబుజిలి మండలం పురుషోత్తపురంలో స్పీకర్ తమ్మినేని సీతారాం.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్న సీఎం జగన్‌కు అందరం రుణపడి ఉంటామన్నారు.
విజయనగరం జిల్లాలో...
గరివిడి మండలం బొండపల్లిలో ఎంపీ బెల్లన చంద్రశేఖర్.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. గ్రామంలో సుమారు 40 మంది మహిళలకు పట్టా పాస్ పుస్తకాలు అందజేశారు. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని.. 90 రోజుల్లో ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని తెలిపారు.
చిత్తూరు జిల్లాలో...
ఈనెల 28న శ్రీకాళహస్తి మండలంలో సీఎం జగన్ చేపట్టనున్న ఇళ్ల పట్టాలు పంపిణీని విజయవంతం చేయాలని.. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కోరారు. నియోజకవర్గంలో సుమారు 25వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు అందజేయనున్నట్లు వివరించారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
కర్నూలు జిల్లాలో...
నవరత్నాలులో భాగంగా పేదలందరికీ ఇళ్లు పంపిణీ ఓ మహాయజ్ఞం అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. బేతంచెర్ల మండలం ఆర్.ఎస్ రంగాపురంలో నవరత్నాలు ఇళ్ల స్థలాలను లబ్ధిదారులకు అందజేశారు. బేతంచెర్ల నుంచి రామళ్లకోటకు రూ. 42 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రహదారికి శంకుస్థాపన చేశారు.
ఇళ్ల పట్టాల పంపిణీతో రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొందని.. పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. మద్దికేరలో 208 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు అందజేశారు. నిరుపేదలకు స్థలం చూపడమే కాక ప్రభుత్వమే గృహ నిర్మాణమూ పూర్తి చేస్తుందన్నారు.
పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో రెండవరోజున.. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి బస్తిపాడులో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి గ్రామంలో మొదటి సారి ఇళ్ల పట్టాలు ఇస్తుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లాలో...
చీరాల మండలం సాల్మన్ నగర్లో జరిగిన ఇళ్ల స్థలాల పంపిణీలో.. ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత పాల్గొన్నారు. గతంలో నియోజకవర్గంలోని గృహనిర్మాణ శాఖ అధికారులు ఇష్టారాజ్యాంగా వ్యవహరించగా.. ఇప్పుడు అలాంటి పరిస్థితి రానీయమని తెలిపారు. మాజీమంత్రి పాలేటి రామారావు, వైకాపా రాష్ట్ర కార్యదర్శి వరికూటి అమృత పాణి, చీరాల తహసీల్దార్ హుస్సేన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కొమరోలులో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు.. పేదలకు ఇళ్ల స్థలాలను అందజేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 30 లక్షల మందికి పైగా.. ఇళ్ల పట్టాలు ఇవ్వడం సామాన్యమైన విషయం కాదన్నారు. ఒక్కో ఇంటికి రూ. 1,80,000 ఖర్చుతో ప్రభుత్వమే గృహం నిర్మించి లబ్ధిదారునికి ఇస్తుందని తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లాలో...
జగ్గంపేట మండలంలోని రాజపూడి, గోవిందపురం, మన్యంవారి పాలెం, కొత్తూరుల్లో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ హయాంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారని.. తర్వాత ప్రభుత్వాలు మారినా పేదవాడి సొంతింటి కల నెరవేరలేదన్నారు. ఇప్పటికీ సీఎం జగన్ ద్వారా అది సుసాధ్యమైందని కొనియాడారు.
ప్రత్తిపాడు మండలం ఒమ్మంగిలో.. ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇస్తామని తెలిపారు.
తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామంలో 793 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభించారు. 300 గృహాల నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు. దశలవారీగా ఇతర మండలాలు, గ్రామాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
పేదల సొంతింటి కల సాకారం చేసి వారి కళ్ళల్లో ముఖ్యమంత్రి ఆనందం నింపారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు
ఆలమూరు మండలం గుమ్మిలేరులోని ఎమ్మెల్యే చిర్ల ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభించారు. జగన్ సీఎం అయిన 18 నెలల్లో అనేక సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. లబ్ధిదారుల అభీష్టానికి అనుగుణంగా నిర్మాణాలు కొనసాగుతాయని.. ఇందుకోసం మూడు ఆప్షన్లను లబ్ధిదారులకే ఇస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 15 రోజుల్లో అందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తామన్నారు. 958 కుటుంబాలకు స్థలాలు అందజేస్తున్నట్లు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో...
యలమంచిలి మండలం మేడపాడులో 361 మంది లబ్ధిదారులకు మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. సొంతిల్లు లేని పేదవాడు ఉండకూడదన్నదే తమ లక్ష్యమన్నారు.
రాష్ట్రచరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇళ్లపట్టాల పంపిణీ జరుగుతోందని.. ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్ గుబ్బల తమ్మయ్యతో కలిసి తణుకులో 214 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను అందజేశారు. ఈ కార్యక్రమం జీవితంలో ఎప్పుడూ చూడని పండగలా ఉందని వ్యాఖ్యానించారు.
ఉంగుటూరు మండలం చేబ్రోలులో ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని 335 మంది లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు స్థలాలు అందజేశారు.
కృష్ణా జిల్లాలో...
విజయవాడ వన్ టౌన్ గాంధీజీ మునిసిపల్ హైస్కూల్లో.. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. నగరానికి దూరంగా ఇస్తున్నామని ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని.. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించి ఊరుగా మార్చే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు.
మైలవరం పరిసర గ్రామాలకు చెందిన 2,470 మందికి పూరగుట్ట వద్ద.. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పేదలకు ఇళ్లస్థలాల విషయంలో మాజీ మంత్రి దేవినేని ఉమ ఎలా మోసం చేశారో వివరించారు. స్థలాలతో ఇవ్వడమే కాక గృహానిర్మాణాలు చేపట్టి.. కాలనీలు, గ్రామాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
చందర్లపాడు కొడవటికల్లులో ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు అంగరంగ వైభవంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యేకి గ్రామస్తులు పూలవర్షంతో స్వాగతం పలికారు. మొత్తం 208 మంది లబ్దిదారులకు స్థలాలను అందజేశారు. పలు గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
గుంటూరు జిల్లాలో...
ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంలో తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయలేదని హోంమంత్రి మేకతోటి సుచరిత ఎదుట ఎస్టీ కాలనీ వాసులు వాపోయారు. 40 మంది దరఖాస్తు చేస్తే నలుగురికే ఇచ్చారని.. ఇల్లు ఉన్నవారికే స్థలాలు కేటాయించారని ఆరోపించారు. రేపటిలోగా ఈ విషయంపై విచారణ చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాలని తహసీల్దార్‌ని ఆమె ఆదేశించారు.
నూజెండ్ల మండలం కంభంపాడు, పమిడిపాడులో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేదలకు ఇళ్లపట్టాలు పంపిణి చేశారు. వంగవీటి మోహన రంగా 32వ వర్ధంతి కార్యక్రమంలోనూ వారు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రంగాతో తనకు ఉన్న అనుబంధాన్ని ఉమ్మారెడ్డి గుర్తు చేసుకున్నారు.
ఇదీ చదవండి:
అసమర్థత కప్పిపుచ్చుకోవడానికే అమరావతిపై సీఎం విమర్శలు: కేశినేని నాని