పోలవరం జల విద్యుత్ కేంద్రం (పీహెచ్‌ఈపీ) విషయంలో గతంలో ఇచ్చిన స్టేను హైకోర్టు ధర్మాసనం ఎత్తేసింది. నవయుగ ఇంజినీరింగ్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి, పీహెచ్‌ఈపీ నిర్మాణ పనులను థర్డ్ పార్టీకి అప్పగించాలని నిర్ణయించినట్లు ఏపీ జెన్‌కో ఈ ఏడాది ఆగస్టు 14న ఒక లేఖలో తెలిపింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అప్పట్లో నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించగా.. తొలుత ఆ లేఖను కోర్టు సస్పెండు చేసింది. దాంతోపాటు ఆగస్టు 17న ఇచ్చిన టెండర్ ప్రకటన ఆధారంగా పీహెచ్‌ఈపీ పనులను థర్డ్ పార్టీకి అప్పగించే ప్రక్రియ చేపట్టవద్దని ఆదేశిస్తూ ఆగస్టు 22న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
ఆ ఉత్తర్వులను ఉపసంహరించాలంటూ(స్టే వెకేట్) ఏపీ జెన్‌కో అనుబంధ వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని అనుమతించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామమూర్తి.. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దుచేస్తూ ఆదేశాలిచ్చారు. ఒప్పందంలో మధ్యవర్తిత్వ విధానాన్ని అనుసరించాలనే నిబంధన ఉన్నందున..... ప్రాథమికంగా చూస్తే ప్రధాన వ్యాజ్యానికి విచారణార్హత లేదని అభిప్రాయం వ్యక్తంచేశారు.
పోలవరం జల విద్యుత్ కేంద్రం నిర్మాణ వ్యవహారంలో... తామిచ్చిన బ్యాంక్ పూచీకత్తులను నగదుగా మార్చుకోకుండా నిలువరించాలని నవయుగ సంస్థ..విజయవాడలోని ఎనిమిదో అదనపు జిల్లా కోర్టులో.. మధ్యవర్తిత్వ విధానాన్ని అనుసరించి పిటిషన్ దాఖలు చేసింది . విచారణ జరిపిన కోర్టు..నగదుగా మార్చుకోకుండా ప్రతివాదులను నిలువరిస్తూ ఆగస్టు 13న ఉత్తత్వులు జారీ చేసింది ఆ ఉత్తర్వులను ఏపీ జెన్‌కో హైకోర్టులో సవాల్ చేయగా.. పూచీకత్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని ధర్మాసనం స్పష్టంచేసింది. నవయుగ సంస్థ వ్యాజ్యంపై విచారణ జరిపి 2 వారాల్లోగా పరిష్కరించాలని విజయవాడ 8వ అదనపు జిల్లా కోర్టును.. హైకోర్టు ఆదేశించింది .
వరద తగ్గగానే పనులు: అనిల్‌కుమార్ యాదవ్
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయని, ఇక గోదావరిలో వరద తగ్గగానే పనులు ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ జల వనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి హైకోర్టు తీర్పు ప్రతిపక్షానికి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. విపక్షాలు ఇప్పటికైనా విమర్శలు మానుకోవాలని, పోలవరం టెండర్ల విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. రివర్స్ టెండర్ల ద్వారా ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
నేటి నుంచే పనులు మొదలు: సీఈ
పోలవరం ప్రాజెక్టు పనులను శుక్రవారం నుంచే ప్రారంభిస్తున్నామని చీఫ్ ఇంజినీరు సుధాకర్‌బాబు వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ గతంలో పోలవరం ప్రాజెక్టు పర్యటనకు వచ్చినపుడు నవంబరు 1 నుంచి పోలవరం ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామని ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చెప్పినట్లే శుక్రవారం పనులు ప్రారంభమవుతున్నాయని చెప్పారు. ఈ పనులు చేపట్టేందుకు కొత్తగా టెండర్లు దక్కించుకున్న మేఘా ఇంజినీరింగు సంస్థతో పని ఒప్పందం ప్రక్రియ శుక్రవారమే ముగుస్తుందని చెప్పారు. అదేరోజు పోలవరం స్పిల్ వే ఎగువన కట్ట నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. వరదలవల్ల ఈ కట్ట దెబ్బతిందని, ఈ కట్టను కొత్తగా నిర్మించుకోవాలని చెప్పారు. అప్రోచ్ రోడ్లు, ఇతర పనులూ చేసుకోవాలన్నారు.
ఇదీ చదవండి: 'స్టే ఎత్తివేశాకే పోలవరం నిర్మాణ పనులు అప్పగింత'