తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు (Dalitha bandhu)పై.. దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు (high court) విచారణ చేసింది. వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ సంస్థ.. ఈ పిల్ దాఖలు చేసింది. నిబంధనలు ఖరారు చేయకుండానే నిధులు విడుదల చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది శశికిరణ్ వాదించారు. నిబంధనలకు సంబంధించిన జీవో వెబ్సైట్లో లేదని పేర్కొన్నారు.
దళిత కుటుంబాలన్నింటికీ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది ప్రసాద్ సమాధానమిచ్చారు. నిబంధనలన్నీ ఖరారు చేసినట్లు ఏజీ వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బందేమిటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. జీవో ఇచ్చిన 24 గంటల్లోనే వైబ్సైట్లో ఉంచాలని ఆదేశించింది. ఏజీ వివరణ నమోదు చేసిన ధర్మాసనం.. వాసాలమర్రిలో దళితబంధు పిల్‌పై విచారణ ముగించింది.