రామ్‌గోపాల్ వర్మ తీస్తున్న దిశ చిత్ర విడుదలను 2 వారాలు ఆపాలని తెలంగాణ హైకోర్టు చిత్రబృందాన్ని ఆదేశించింది. దిశ తండ్రి అప్పీలుపై విచారణను ధర్మాసనం ముగించింది. సినిమా టైటిల్‌ను "ఆశ ఎన్‌కౌంటర్‌గా" మార్చినట్లు దర్శక, నిర్మాతలు.. ఆనంద్ చంద్ర, అనురాగ్ హైకోర్టుకు తెలిపారు. ఆశ ఎన్కౌంటర్ సినిమాకు ఏప్రిల్ 16న ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు సెన్సార్ బోర్డు వెల్లడించింది.
ప్రతిష్ఠ దెబ్బతింటుంది...
దిశ అత్యాచారం, హత్య ఘటన ఆధారంగా చిత్రీకరిస్తున్న సినిమా విడుదలను ఆపాలని కోరుతూ యువతి తండ్రి దాఖలు చేసిన అప్పీలుపై హైకోర్టులో విచారణ జరిగింది. రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న సినిమా విడుదలైతే తమ కుటుంబ ప్రతిష్ఠ దెబ్బతింటుందని.. సినిమాను నిలిపివేయాలని పిటిషనర్ కోరారు. సినిమా నిర్మాత రాంగోపాల్ వర్మ కాదని.. తామే దర్శక, నిర్మాతలమని హైకోర్టుకు ఆనంద్ చంద్ర, అనురాగ్ హైకోర్టుకు తెలిపారు.
మరో పిటిషన్ వేసుకోవచ్చు..
సినిమా టైటిల్‌ను మార్చామని.. సెన్సార్ సర్టిఫికెట్ కూడా వచ్చిందని నివేదించారు. కరోనా తీవ్రత ప్రభావం వల్ల విడుదల చేయలేకపోయామని.. త్వరలో థియేటర్లు లేదా ఓటీటీ ద్వారా విడుదల చేయనున్నట్లు వివరించారు. సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చినందున.. విచారణ జరపాల్సిన అవసరం లేదని ధర్మాసనానికి తెలిపారు. అభ్యంతరం ఉంటే సెన్సార్ బోర్టు సర్టిఫికెట్‌ను సవాల్ చేస్తూ మరో పిటిషన్ వేసుకోవచ్చునని ధర్మాసనం సూచించింది.
రెండు వారాలు వాయిదా..
సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని పిటిషనర్ సవాల్ చేసుకునేందుకు వీలుగా సినిమా విడుదలను వారం రోజులు నిలిపివేసేందుకు సిద్ధమని దర్శక, నిర్మాతలు తెలిపారు. సినిమా విడుదలను రెండు వారాల పాటు నిలిపి వేయాలని హైకోర్టు ఆదేశిస్తూ.. అప్పీలుపై విచారణ ముగించింది.
ఇదీ చదవండి: