High Court on Anandaiah Medicine: కొవిడ్ నిరోధానికి మందును తీసుకునేందుకు తన ఇంటికి వస్తున్న ప్రజలు, బాధితులను పోలీసులు అడ్డుకుంటున్నారని.. ఔషధ పంపిణీ విషయంలో వారి జోక్యాన్ని నిలువరించేలా ఆదేశాలు ఇవ్వాలని నెల్లూరు జిల్లా కృష్ణపట్టణం వాసి, ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య.. హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. గురువారం విచారణ ప్రారంభం కాగానే ఆయన తరపు న్యాయవాది వ్యాజ్యంపై అత్యవసర విచారణకు అనుమతించాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ స్పందిస్తూ .. శుక్రవారం విచారణ చేస్తామన్నారు. రాష్ట్ర హోం శాఖ ముఖ్యకార్యదర్శి, నెల్లూరు ఎస్పీ, డీఎస్పీ, కృష్ణపట్నం పోలీసులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
కొత్త వేరియంట్ ఒమిక్రానుకు మందు ఇస్తున్నానంటూ.. కొందరు చేసిన ప్రచారం వాస్తవం కాదని అధికారులకు బదులిచ్చామని పిటిషన్లో పేర్కొన్నారు. ఆ వివరాలను పట్టించుకోకుండా పోలీసు కానిస్టేబుళ్లను తన ఇంటి ముందు ఉంచారన్నారు. ఆయుర్వేద మందు కోసం వస్తున్న వారిని అడ్డుకుంటున్నారు. ఔషధ పంపిణీని అడ్డుకోవడం చట్ట విరుద్ధం అన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని పోలీసుల జోక్యాన్ని నిలువరించాలన్నారు. తనకు తగిన పోలీసు భద్రత కల్పిస్తూ.. మందు పంపిణీ సేవ సజావుగా జరిగేలా అధికారులను ఆదేశించాలని కోరారు.