ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో గోదావరిలో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాలతో ప్రాణహిత నదికి భారీగా నీరు వస్తోంది. దీని వల్ల కాళేశ్వరం వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద ఈ ఏడాది గరిష్ఠ స్థాయిలోనే 51 అడుగులకు వరద చేరింది. స్నాన ఘట్టాలు చాలా వరకు మునిగిపోయాయి. ధవళేశ్వరం నుంచి ఐదున్నర లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళుతోంది.
మేడిగడ్డకు భారీగా ప్రవాహం
మేడిగడ్డ బ్యారేజీకి 13 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుండగా మొత్తం 85 గేట్లను ఎత్తి అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. 25.2 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించిన ఈ బ్యారేజీ నుంచి ఇంత భారీ ప్రవాహాన్ని వదలడం ఇదే తొలిసారి.
జూరాలకు పదేళ్లలో గరిష్ఠ స్థాయిలో
జూరాల జలాశయానికి రికార్డు స్థాయిలో నీరు వచ్చి చేరుతోంది. 2009-10 లో 811 టీఎంసీల నీరు చేరగా ఈసారి 857 టీఎంసీలుగా ఉంది. 20 ఏళ్లలో జూరాలకు సగటున ఏటా 627 టీఎంసీల వరకు వరద వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వరద భారీగా వచ్చినా ఎత్తిపోతల పథకాల్లోని అన్ని మోటార్లను నడపలేకపోవడం, కాలువల సామర్థ్యం తక్కువగా ఉండడం వల్ల ఆయా ప్రాజెక్టులకు కేటాయించిన మేర నీటిని వాడుకోలేని పరిస్థితి నెలకొంది.
ములుగులో ప్రమాదకర రీతిలో...
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. రామన్నగూడెం, రామనగర్ గ్రామాల మధ్య జీడి వాగులోకి వరద ప్రవేశించడం వల్ల ఈ రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముల్లెకట్ట, శంకరాజుపల్లె, రొయ్యూరు గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరి, మిరపనారు మళ్లు నీటమునిగాయి.
సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు
ఖమ్మం జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద 49 అడుగులతో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అధికారులు ముందు జాగ్రత్తగా నాగారం, గుమ్మడిదొడ్డిలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బొగత జలపాతం వద్ద వరద పెరగడం వల్ల భారీగా నీరు దిగువకు ప్రవహిస్తోంది. పర్యటకులను సందర్శనకు అనుమతించలేదు. కొంగాల, ధూలాపురం, కోయవీరాపురం, చీకుపల్లి, పెదగొల్లగూడెం, తదితర గ్రామాల్లో మిర్చినారు, వరిపొలాలు నీటమునిగాయి. వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు.