చికిత్సకు వెయ్యి రూపాయలు దాటిన ఆరోగ్య సేవలన్నింటికీ ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తామన్న ప్రభుత్వ హామీని.. అమలు చేసే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. మూడు జిల్లాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో నిపుణుల కమిటీ ఈ మేరకు పరిశీలించనుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం అనంతపురం జిల్లా కదిరి, గుంటూరు జిల్లా నరసరావుపేట, విశాఖ జిల్లా నర్సీపట్నంలో నిపుణుల కమిటీ పర్యవేక్షించనుంది. ఇక్కడి సామాజిక ప్రాంతీయ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రోజుకు ఎంత మంది రోగులు వస్తున్నారు. ఏయే జబ్బులతో వస్తున్నారు ? ఎలాంటి పరీక్షలు చేయించుకుంటున్నారు? వీటన్నింటికి ఎంత మేరకు ఖర్చవుతుందనే అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేస్తారు.
రెట్టింపు కానున్న సేవలు
ఈ తరహాలోనే ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ పరిశీలన జరిపే విషయమై కసరత్తు జరుగుతుంది. వెయ్యి రూపాయలు దాటితే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించే పథకంపై వివిధ సంస్థల నుంచి కమిటీ అభిప్రాయాలు సేకరించింది. ముఖ్యమంత్రి జగన్‌తో నిపుణుల కమిటీ భేటీ కానుంది. ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డు దారులకు1059 సేవలు ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా లభిస్తున్నాయి. నిపుణుల కమిటీ అధ్యయనం తర్వాత ఈ సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది.
ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేసే దిశగా..
ఆరోగ్య శ్రీ సేవలు రాష్ట్రపరిధిలోనే గాక...తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలోనూ అమలు చేయాలని కోరుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ అవకాశాన్ని కల్పిస్తామని వైకాపా నవరత్నాల హామీల్లో ప్రకటించింది. దీనికి సంబంధించి ఉన్న ప్రతికూల, సానుకూల పరిణామాలపైనా పరిశీలన జరుగుతోంది. 5 లక్షలలోపు వార్షిక ఆదాయం కలిగిన వారిని ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురానున్నారు. ఈ పథకం కింద తెల్లరేషన్‌కార్డుదారులు, జర్నలిస్టులు, ఆరోగ్యరక్ష పథకాల అమలు ఒకేలా ఉండాలని సంస్కరణల కమిటీ అభిప్రాయపడింది. ఉద్యోగుల ఆరోగ్య సేవల పథకం విడిగా కొనసాగిస్తూ మిగిలిన పథకాలను ఒకేలా అమలు చేయాల్సిన అవసరం ఉందని భావిస్తోంది. తెలంగాణలో మాదిరిగా అవయవ మార్పిడి జరిగితే అందుకయ్యే వ్యయం ఎంత? ఎంతవరకు ప్రభుత్వపరంగా జరిగేందుకు వీలుంటుంది ? ఎటువంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయన్న దానిపైనా పరిశీలన జరుపుతున్నారు.
కొత్తగా వైద్యుల నియామకం
ఆరోగ్యశ్రీ సేవలను మెరుగుపరిచేందుకు 30 మంది వైద్యులను కొత్తగా నియమించారు. అనుబంధ ఆసుపత్రుల్లో అదనంగా మరో 700 మంది ఆరోగ్యమిత్రల నియామకానికి ఆమోదం కోరుతూ ప్రతిపాదనలు పంపారు. అనుబంధ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశమై ప్రభుత్వ లక్ష్యాలను వివరించి పారదర్శకంగా వ్యవహరించాలని, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
త్వరలో ఆరోగ్య డిజిటల్ కార్డులు
రాష్ట్రంలోని ప్రతీ పౌరుడి ఆరోగ్య వివరాలను తెలుసుకునేలా త్వరలోనే ఆరోగ్య డిజిటల్ కార్డులను రూపోందించనున్నట్టు ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. క్యూఆర్ కోడ్ లతో కూడిన కుటుంబ ఆరోగ్య కార్డులను జారీ చేస్తామని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షించిన సీఎం .. వెయ్యి 108, 104 వాహనాలను నూతనంగా కోనుగోలు చేయనున్నట్టు వెల్లడించారు. ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత వైద్య చికిత్సల కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా పశ్చిమగోదావరి జిల్లా నుంచి ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. రాష్ట్రం వెలుపల కూడా ఆరోగ్య శ్రీ సేవలందేలా హైదరాబాద్, బెంగుళూరు తదితర ప్రాంతాల్లో 150 ఆస్పత్రులకు అనుమతి ఇస్తామని సీఎం జగన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి: