గ్రామసచివాలయ ఉద్యోగులకు ఎంపికైన వారికి అధికారులు రాష్ట్రవ్యాప్తంగా నియామక పత్రాలు అందించారు.
గుంటూరు జిల్లా...
గ్రామ సచివాలయాలతోనే దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ చెప్పారు. గుంటూరు జిల్లాలో గ్రామసచివాలయ ఉద్యోగాలు దక్కించుకున్న అభ్యర్థులకు మంత్రులు మోపిదేవి వెంకటరమణ, మేకతోటి సుచరిత, ఉపసభాపతి కోన రఘుపతిలు నియామక పత్రాలు అందజేశారు. ఇప్పుడు ఉద్యోగం సాధించలేని వాళ్లు నిరుత్సాహ పడొద్దని...త్వరలోనే మరిన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు విడుదల చేస్తున్నట్లు మంత్రులు పేర్కొన్నారు.
విజయనగరం జిల్లా...
పాదయాత్రలో యువతీ, యువకులకు జగన్ ఇచ్చిన హామీని..., గ్రామ సచివాలయ ఉద్యోగాల కల్పన ద్వారా నిలబెట్టుకున్నారన్నారని ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అన్నారు. విజయనగరంలోని రాజీవ్ క్రీడామైదానంలో చేపట్టిన గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, పలువురు శాసనసభ్యులు, సంయుక్త కలెక్టర్ వెంకట రమణారెడ్డి, ఎస్పీ రాజకుమారితో కలసి 4వేల 220మందికి నియామక పత్రాలు అందించారు.
శ్రీకాకుళం జిల్లా...
శ్రీకాకుళంలో గ్రామ, వార్డు సచివాలయ పోస్టులకు ఎంపికైన వారికి మంత్రి ధర్మాన కృష్ణ దాస్ నియామక పత్రాలను అందజేశారు. భారీ సంఖ్యలో ఉద్యోగ కల్పనతో... యువత కలలను సీఎం జగన్ సాకారం చేశారని మంత్రి అన్నారు.
కర్నూలు జిల్లా...
కర్నూలులోని జిల్లా పరిషత్‌లో గ్రామ, వార్డు సచివాలయాలకు ఎంపికైన వారికి ఆర్థిక మంత్రి బుగ్గన నియామక పత్రాలను అందించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లా అభ్యర్ధులు ఉద్యోగాలు సాధించారని సంతోషం వ్యక్తం చేశారు. సిఫార్సులతో ఉద్యోగాలు కల్పించారన్న ప్రతిపక్షం విమర్శలు నిజమైతే.... ఇంకా 20 వేల ఉద్యోగాలు ఎందుకు మిగిలిపోయాయని ఆర్థికమంత్రి బుగ్గన ప్రశ్నించారు.
నెల్లూరు జిల్లా...
నెల్లూరు కస్తూర్భా కళాక్షేత్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే కార్యక్రమం నిర్వహించారు. ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్... ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించారు. ఎలాంటి సిఫారసులు లేకుండా... తమ ప్రతిభతోనే ఉద్యోగాలు సాధించారని మంత్రి అన్నారు.
ప్రకాశం జిల్లా...
ప్రజా సేవకోసం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థను కొత్తగా ఎంపికైన ఉద్యోగులు సక్రమంగా పనిచేసి, ప్రభుత్వ ఆశయాలను నెరవేర్చాలని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లాలో ఎంపికయిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఒంగోలులో నియామకపత్రాలను అందజేశారు. మార్కాపురంలో నిర్వహించిన నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పాల్గొన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా...
గ్రామ, వార్డు సచివాలయాలతో ప్రజాసమస్యలకు పరిష్కారంతోపాటు.. ఉద్యోగకల్పన జరిగిందని ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామయక పత్రాలను అభ్యర్థులకు అందించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూసిన నిరుద్యోగుల కలలు... ముఖ్యమంత్రి జగన్ నెరవేర్చారన్నారు. ఆయా ప్రాంతాల అభివృద్ధిలో ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.