విశాఖ జిల్లా మూడు జిల్లాలు విభజించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. విశాఖ నగర పరిధిలోని 4 నియోజకవర్గాలతో పాటు, పెందుర్తి, గాజువాక , భీమిలి మాత్రమే విశాఖ జిల్లాలో ఉండనున్నాయి. అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, ఎలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో తుని నియోజకవర్గం కలుపుకుని అనకాపల్లి జిల్లాగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించినట్టు సమాచారం. దీనివల్ల జిల్లాలో మైదాన ప్రాంతం రెండుగా విడిపోనుంది. పారిశ్రామిక జిల్లాగా ఉన్న విశాఖలోని ఫార్మాసిటీ, అపెరల్ సిటీ, ఎన్టీపీసీ సింహాద్రి వంటివి అనకాపల్లి జిల్లా పరిధిలోకి భౌగోళికంగా వచ్చే అవకాశం ఉంది.
వివరాలు సేకరణ...
అనకాపల్లి జిల్లా ఏర్పాటు కోసం ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి అనువుగా ఉన్న భవనాలను గుర్తించేందుకు రెవెన్యూ అధికార్లు ఇప్పటికే సర్వే చేశారు. రాష్ట్రస్థాయి కమిటీకి ఇచ్చేందుకు నివేదిక సిద్దం చేశారు. ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించేందుకు వీలుగా ఉన్న భూముల వివరాలను కూడా సేకరించారు.
అరకు కేంద్రంగా...
ప్రస్తుతం విశాఖల్లాలో దాదాపు సగభాగం అటవీ ప్రాంతం ఉంది. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని అరకు కేంద్రంగా ఒక జిల్లాగా ప్రతిపాదిస్తున్నారు. అరకు, పాడేరు నియోజక వర్గాలతోపాటు జి.మాడుగులను కూడా ఈ పరిధిలోకి తెస్తారు. ప్రస్తుత జిల్లాలో ఉన్న 11 గిరిజన మండలాలను అరకు జిల్లా పరిధిలోకి తీసుకురానున్నారు. ఇప్పటికే పాడేరులో సబ్ కలెక్టర్ , ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ కార్యాలయాలు ఉన్నాయి. గిరిజన సహకార కార్పొరేషన్ కార్యాలయాలు కూడా అక్కడే ఉన్నాయి. పర్యాటక ప్రాంతంగా ఉన్న అరకులోయ ఇప్పుడు జిల్లా కేంద్రంగా మొత్తం గిరిజన ప్రాంత సేవలకు కేంద్రం కానుంది.
విశాఖ జిల్లా విభజనకు అవసరమైన అన్ని దస్త్రాలను సిద్ధం చేయాలని రెవెన్యూ యంత్రాంగానికి కలెక్టర్ వినయ్ చంద్ సూచనలిచ్చారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జరుగుతున్న ప్రక్రియల్లో ఎక్కడా జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు.
ఇదీ చదవండి