గ్రామ పంచాయతీ భవనాలకు ప్రస్తుతమున్న రంగులు తొలగించాలని ఆదేశిస్తూ... పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ భవనాలకు పై భాగంలో తెలుపు రంగు (హాఫ్ వైట్ కలర్) వేయాలని, భవనం కింది నుంచి రెండున్నర అడుగుల ఎత్తు వరకూ మట్టి (టెర్రాకోట) రంగు వేయాలని ఆదేశించారు. భవనం పైభాగంలో 8 అంగుళాలు మట్టి రంగు వేయాలని, గ్రామీణ నేపథ్యం ఉట్టిపడేలా రంగులుండాలని పంచాయతీరాజ్ కమిషనర్, ఈఎన్‌సీలను ఆదేశించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో వెంటనే ఈ చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ డీపీవోలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పంచాయతీ భవనాల రంగులపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు రద్దుచేసింది. ఈ తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పులో జోక్యం అవసరం లేదన్న సర్వోన్నత న్యాయస్థానం 4 వారాల్లో పాత రంగులు తొలగించాలంటూ ఇటీవల ఆదేశాలిచ్చింది.