ETV Bharat / city

గోదావరి - కావేరి అనుసంధానం.. ఖరారు చేసిన జాతీయ జల అభివృద్ధి సంస్థ

గోదావరి- కావేరి (Godavari-kaveri) అనుసంధానాన్ని జాతీయ జల అభివృద్ధి సంస్థ (NWDA) ఖరారు చేసింది. తుది సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించి రాష్ట్రాలకు పంపింది. ఈ ప్రాజెక్టు అనుసంధానానికి రూ. 85,962 కోట్లు ఖర్చవుతుందని తేల్చింది.

గోదావరి-కావేరి అనుసంధానాన్ని ఖరారు చేసిన జాతీయ జల అభివృద్ధి సంస్థ

author img

By

Published : Jun 1, 2021, 6:51 AM IST

గోదావరి- కావేరి (Godavari-kaveri) అనుసంధానాన్ని జాతీయ జల అభివృద్ధి సంస్థ (NWDA) ఖరారు చేసింది. తుది సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)ను రూపొందించి రాష్ట్రాలకు పంపింది. తెలంగాణలోని ఇచ్చంపల్లి వద్ద గోదావరి నది (Godavari river)పై బ్యారేజీ నిర్మించి తమిళనాడులో కావేరి నదిపై ఉన్న గ్రాండ్‌ ఆనకట్ట వరకు 247 టీఎంసీల నీటిని మళ్లించి సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేసే ఈ పథకానికి 2020-21 ధరల ప్రకారం రూ. 85,962 కోట్ల వరకూ ఖర్చవుతుందని తేల్చింది. రోజుకు 2.2 టీఎంసీల చొప్పున నీటిని మళ్లించే ఈ పథకం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో 4.53 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టుకు, 4.91 లక్షల హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణకు నీరందుతుందని పేర్కొంది.

గోదావరి- కావేరి అనుసంధానం

ఇచ్చంపల్లి నుంచి 2.2 టీఎంసీలు

తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని ఇచ్చంపల్లి వద్ద గోదావరి నదిపై బ్యారేజీ నిర్మాణం చేపడతారు. దీని నిల్వ సామర్థ్యం 15.89 టీఎంసీలు. ఈ బ్యారేజీ బ్యాక్‌వాటర్‌ ప్రభావం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీపై ఉండదని డీపీఆర్‌ పేర్కొంది. ఇచ్చంపల్లి బ్యారేజీ నుంచి రోజూ 2.2 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్‌కు మళ్లిస్తారు. మార్గంమధ్యలో గొట్టిముక్కల బ్రాంచి కాలువ కింద నల్గొండ జిల్లాలోని మునుగోడు, చండూరు ప్రాంతాల్లో 80 వేల హెక్టార్ల కొత్త ఆయకట్టుకు సాగునీరందిస్తారు.

ఎస్సారెస్పీ రెండో దశ కింద లక్షా 78 వేల హెక్టార్లు, శ్రీశైలం ఎడమగట్టు కాలువ కింద లక్షా 9 వేల హెక్టార్లకు నీరందుతుందని డీపీఆర్‌ (Dpr) పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో నాగార్జునసాగర్‌ కుడి కాలువ కింద లక్షా 26 వేల హెక్టార్లకు, నాగార్జునసాగర్‌- సోమశిల కింద లక్షా 68 వేల హెక్టార్ల కొత్త ఆయకట్టుకు నీరందుతుంది. సోమశిల -కావేరి మధ్య 2 లక్షల 5 వేల హెక్టార్ల కొత్త ఆయకట్టుకు, కావేరి డెల్టా కింద 78,250 హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణకు నీరందుతుంది. మూడు రాష్ట్రాల్లో తాగు, పారిశ్రామిక అవసరాలకు కేటాయింపులు అదనం. చెన్నై నగరానికి తాగు, పారిశ్రామిక అవసరాలకు ప్రత్యేకంగా 25 టీఎంసీలు కేటాయించారు.

కావేరి- గోదావరి అనుసంధానం

నీటి లభ్యత ఇలా...

నదుల అనుసంధానంలో భాగంగా ఒడిశాలోని మహానది నుంచి గోదావరికి మళ్లించి, ఇక్కడి నుంచి కావేరి వరకు మళ్లించాలన్నది తొలుత ప్రతిపాదించారు. మహానదిలో మిగులు జలాలు లేవంటూ ఒడిశా అంగీకరించలేదు. దీంతో మొదట గోదావరి నుంచే నీటిని మళ్లించాలని, రెండో దశలో బ్రహ్మపుత్ర- గంగ- సువర్ణరేఖ- మహానది- గోదావరి అనుసంధానం చేపట్టాలని తాజాగా నిర్ణయించారు.

జాతీయ జల అభివృద్ధి సంస్థ (NWDA) నివేదిక ప్రకారం శ్రీరామసాగర్‌- ఇచ్చంపల్లి మధ్య ఎగువ, దిగువ అవసరాలు, దిగువన ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టుల అవసరాలు పోనూ 75 శాతం నీటి లభ్యత కింద 176.65 టీఎంసీల లభ్యత ఉంటుంది. ఇంద్రావతి నుంచే వచ్చేవి, ఛత్తీస్‌గఢ్‌కు కేటాయించి ఇంకా నిర్మాణాలు ప్రారంభం కానివి.. ఇలా అన్నీ కలిసి ఇచ్చంపల్లి వద్ద మొత్తం 324 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని, ఇందులో 247 టీఎంసీలు గోదావరి- కావేరి అనుసంధానానికి మళ్లిస్తామని డీపీఆర్‌లో వివరించారు.

రాష్ట్రాల అభిప్రాయాలకు చోటు...

డీపీఆర్‌లో రాష్ట్రాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు కూడా ఎన్‌డబ్ల్యూడీఏ (NWDA) చోటు కల్పించింది. తమకు ఇప్పటికే నీటి లోటు ఉందని, వేసవిలో ఎదురయ్యే నీటి ఎద్దడిని పరిగణనలోకి తీసుకోవాలని ఛత్తీస్‌గఢ్‌ పేర్కొంది. తమ అవసరాలకు పోనూ మిగులు జలాలు లేవని తెలిపింది. బేసిన్‌లోని అన్ని అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని, మిగులు ఉందని తేల్చాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వమే నీటి లభ్యతపై అధ్యయనం చేయించాలని తెలంగాణ సూచించింది. ఇప్పుడే అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం సరికాదని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ అభిప్రాయం డీపీఆర్‌లో లేదు. తమిళనాడు మాత్రం వెంటనే చేపట్టాలని కోరింది.

తెలంగాణకు 65.8 టీఎంసీలు.. ఆంధ్రప్రదేశ్‌కు 79.92

దుమ్ముగూడెం, అకినేపల్లి, పోలవరం.. ఇలా పలు ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేసిన ఎన్‌డబ్ల్యూడీఏ (NWDA) గత లోక్‌సభ ఎన్నికలకు ముందు అకినేపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి నీటిని మళ్లించేలా సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేసింది. 2019 మార్చిలో ముసాయిదా డీపీఆర్‌ను రాష్ట్రాలకు పంపి అభిప్రాయాలను కోరింది. ఆ తర్వాత దీనిపై అడుగు ముందుకు పడలేదు.

గత ఏడాది నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ వెదిరే శ్రీరాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో అకినేపల్లి నుంచి కాకుండా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి నీటిని మళ్లించే ప్రతిపాదన తెరమీదకు రాగా.. సమావేశం ఆమోదం తెలిపింది. తాజాగా తుది డీపీఆర్‌ (Dpr)ను తయారు చేసి రాష్ట్రాలకు పంపింది. తెలంగాణ ప్రభుత్వ సూచన మేరకు ఇచ్చంపల్లి నుంచి నీటిని మళ్లించే పథకాన్ని చేపట్టినట్లు అందులో పేర్కొంది. జూన్‌ నుంచి అక్టోబరు మధ్య 143 రోజుల్లో మళ్లించే 247 టీఎంసీలలో ఆవిరయ్యే నీరు పోనూ ఉండే 230 టీఎంసీలలో తెలంగాణలో 65.8, ఆంధ్రప్రదేశ్‌లో 79.92, తమిళనాడులో 84.28 టీఎంసీల వినియోగం ఉండేలా ప్రతిపాదించారు.

1,088 స్ట్రక్చర్లు... 3 లిఫ్టులు

ఇచ్చంపల్లి నుంచి కావేరిపై ఉన్న గ్రాండ్‌ ఆనకట్ట వరకు 19 కి.మీ. దూరం సొరంగమార్గంతో కలిపి 1,211 కి.మీ. దూరం కాలువ తవ్వాల్సి ఉంటుంది. మార్గంమధ్యలో 1,088 స్ట్రక్చర్లు నిర్మించాలి. ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్‌ వరకు నీటిని మళ్లించే క్రమంలో మూడు లిప్టుల అవసరం ఉంది. వీటి నిర్వహణకు 3,845 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు కావాలి.

ఈ ఖర్చు ఏటా రూ.769 కోట్లు ఉంటుంది. 366 మిలియన్‌ యూనిట్ల సామర్థ్యం గల జల విద్యుత్తు కేంద్రాలను నిర్మిస్తారు. ఇచ్చంపల్లి వద్ద నిర్మించే బ్యారేజీతో 9,306 హెక్టార్లు ముంపునకు గురవుతాయని, ఇదంతా నదీ గర్భమేనని డీపీఆర్‌ పేర్కొంది. మార్గంమధ్యలో 9 గ్రామాలు, 5,475 కుటుంబాలకు చెందిన 21,575 మంది నిరాశ్రయులవుతారు.

పథకం సమగ్ర స్వరూపం
* ఇచ్చంపల్లి నుంచి గ్రాండ్‌ ఆనకట్ట వరకు 247 టీఎంసీల నీటి మళ్లింపు
* 1,211 కి.మీ. కాలువ తవ్వకం..19 కి.మీ. సొరంగమార్గం
* 4.53 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టుకు, 4.91 లక్షల హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణకు నీరు
* మూడు రాష్ట్రాల్లో తాగు, పారిశ్రామిక అవసరాలకూ కేటాయింపులు
* చెన్నైకి ప్రత్యేకంగా 25 టీఎంసీలు

ఇదీ చూడండి:

కృష్ణపట్నంలో పండగ వాతావరణం...ఔషధం పంపిణీకి చకచకా ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.