కేంద్రం సమ్మతి ప్రకారం ఏటా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3 శాతం మేర అప్పులు తీసుకునేందుకు మాత్రమే వీలుంటుంది. ఆ లెక్కన ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రూ.30 వేల కోట్ల రుణాలకు అవకాశం ఉంది. ప్రతి నెలలోనూ సగటున రూ.5 వేల కోట్ల వరకూ రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా ఆ మొత్తాన్ని సమీకరిస్తోంది. డిసెంబర్ వరకూ రూ.24 వేల కోట్ల రుణాలు తీసుకునేందుకు కేంద్రం అనుమతినివ్వగా ఆ మేర సమీకరణ దాదాపు పూర్తైంది.
ఆ మూడు షరతులకు ఓకే
కరోనా ఉద్ధృతి, లాక్‌డౌన్ కారణంగా మార్చి నుంచి రాష్ట్ర ఆదాయం పడిపోయింది. దీంతో ఎఫ్ఆర్బీఎమ్ చట్ట సవరణకు అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎఫ్ఆర్బీఎమ్ పరిమితి పెంపునకు కేంద్రం అంగీకరించింది. అందులో అర శాతానికి సమానమైన రుణాన్ని ఏ నిబంధనలూ లేకుండా వాడుకోవచ్చన్న కేంద్రం మరో ఒకటిన్నర శాతం పరిమితి వినియోగానికి కొన్ని షరతులు విధించింది. ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు అమలు, విద్యుత్ రాయితీల మొత్తం నేరుగా రైతులకు ఇచ్చి వారి నుంచి బిల్లుకు తగ్గట్టుగా వసూలు చేయడం వంటి 3 షరతులను ప్రతిపాదించింది. వాటిని ఆచరిస్తామంటూ రాష్ట్రం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది.
గవర్నర్ వద్దకు ఆర్జినెన్స్ ..!
గత మంగళవారం రూ.5 వేల కోట్లలో కొంత రుణ సమీకరణకు రాష్ట్రం ప్రయత్నించగా ఎఫ్ఆర్బీఎమ్ చట్ట సవరణ చేయనందున రుణం సాధ్యం కాదని ఆర్బీఐ పేర్కొన్నట్టు తెలిసింది. చట్ట సవరణ చేశాకే అదనంగా రుణాలు తీసుకోవాలని షరతు పెట్టడంతో... అత్యవసరంగా ఆర్డినెన్స్ రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ వారంలో ఉద్యోగులకు జీతాల చెల్లింపు, సెప్టెంబర్‌లో ఆసరా పథకం కింద రూ.6 వేల 700 కోట్ల నగదు పంచాల్సి ఉంది. ఇవి సమకూరాలంటే చట్ట సవరణ చేసి కేంద్రం నిబంధనలు అమలు చేయగలిగితే కొత్తగా రూ. 20 వేల కోట్ల వరకూ రుణ వెసులుబాటు లభిస్తుంది. ఆ మేరకు ఎఫ్ఆర్బీఎమ్ పరిమితిని 3 నుంచి 5 శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన చట్ట సవరణ ఆర్డినెన్స్‌ను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు రాష్ట్ర ప్రభుత్వం పంపినట్టు సమాచారం. స్వల్పకాల నోటీసుతో కొద్దిమంది మంత్రుల సంతకాలతోనే ఆర్డినెన్స్‌ను ఆమోదం కోసం పంపినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి : గిరిపుత్రుల సంకల్పం... గ్రామానికి సొంతంగా రహదారి